రైతుల అభివృద్ధి కోసమే రైతుబంధు సాయం
డిమాండ్ ఉన్న పంటలతోనే లాభాలు
సాంకేతిక సాయంతో నష్టాలను అధిగమించొచ్చు
ఇతర పంటలే ఆర్థిక ఎదుగుదలకు దోహదం
కలెక్టర్ ఆర్వీ కర్ణన్
ఉత్తర తెలంగాణ స్థాయి పరిశోధన, విస్తరణ, సలహా సంఘ సమావేశం
కలెక్టరేట్, మార్చి 28: వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల అభివృద్ధిని కాంక్షించి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం కూడా అందజేస్తున్నదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ఉత్తర తెలంగాణ స్థాయి పరిశోధన, విస్తరణ, సలహా సంఘ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగు చేస్తేనే రైతులు అభివృద్ధి చెందుతారని స్పష్టం చేశారు. డ్రోన్ల వినియోగం లాంటి సాంకేతిక సాగుతో రైతులు నష్టాలను అధిగమించవచ్చన్నారు. ప్రత్యామ్నాయ పంటలతోనే ఆర్థికంగా ఎదగవచ్చని సోదాహరణంగా వివరించారు.
పంటలను ఆశిస్తున్న చీడ, పీడలు, తెగుళ్లపై శాస్త్రవేత్తల కంటే రైతులకే ఎక్కువ అనుభవం ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఉత్తర తెలంగాణలో నీటి నిల్వలు పెరిగిపోయి, పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రెండేళ్ల నుంచి వరి విస్తీర్ణం పెరిగిందని, దీంతో కొనుగోలు సమస్య వచ్చి రైతులు నష్టాల పాలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. దీనిని గమనించి ప్రభుత్వం ఈ యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేయాలని చేసిన సూచనతో గతంలో కన్నా సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. రైతులకు ఆర్థికంగా లాభాలు చేకూర్చే పంటలపై అవగాహన కల్పించాల్సిన అవసరమున్నదన్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని, పాలీహౌస్, జీరో టిల్లేజ్, చిరుధాన్యాల సాగుపై వ్యవసాయ శాఖ అన్నదాతలకు అవగాహన కల్పించాలని సూచించారు. పంటమార్పిడి, ఆరుతడి పంటల సాగువైపు రైతులు దృష్టి పెట్టాలని, తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం పాటు అత్యధిక లాభాలు ఇచ్చే ఆయిల్‌పాం సాగుపై విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.
కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలి
ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డా.ఆర్.జగదీశ్వర్ మాట్లాడుతూ, కాలానుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఎరువుల వాడకాన్ని తగ్గించి సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటించాలని కోరారు. పంట మార్పిడితో భూసారం పెరుగుతుందని, వ్యవసాయ శాస్త్రవేత్త సలహాలు, సూచనలతో అధిక దిగుబడులు సాధించే అవకాశముంటుందని తెలిపారు. పొలాస వ్యవసాయ పరిశోధన సంస్థ అసోసియేట్ డైరెక్టర్ డా.ఉమాదేవి మాట్లాడుతూ, వ్యవసాయ పరిశోధనలో సాధించిన ప్రగతి దేశంలోని రైతాంగానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా పలు రకాల పంటలను చీడ, పీడల బారి నుంచి రక్షించుకునే విధానం, పంటలకు వచ్చిన రోగాలకు అవసరమైన చికిత్స విధానంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. భోజన విరామానంతరం నిర్వహించిన రెండో సెషన్లో పంటల సాగులో ఉండే ప్రత్యేక సమస్యలు, వాటిని నివారించే అంశాలపై ప్రొ.జయశంకర్ విశ్వవిద్యాలయ బోధకులు బీ గోవర్ధన్ యాదవ్, నిమ్మల అనసూయ ప్రసంగించారు. మూడో సెషన్లో కన్జర్వేషన్ అగ్రికల్చర్‌పై డా.రామ్‌ప్రకాశ్, చిరుధాన్యాల పోషకాలపై డా.ఎంవీ నగేశ్ కుమార్, వ్యవసాయంలో డ్రోన్ పరికరాల ఉపయోగంపై డా.ఎన్ ఆర్ జీ వర్మ, డా.కిరణ్‌బాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతుల్లో సాగు లాభాదాయకం
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో వ్యవసాయశాఖ సాయంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా రైతులకు పరిశోధన ఫలితాలను నేరుగా వివరించే అవకాశం లభించింది. పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై నేరుగా చర్చించి, వారి అనుమానాలు నివృత్తి చేస్తే, నష్టాలు అధిగమిస్తారు. ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే ఖర్చు తగ్గి అత్యధిక లాభాలు పొందవచ్చు. వచ్చే విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. –డా.ఎం.వెంకటరమణ, ప్రొ.జయశంకర్ విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ సైంటిస్ట్
వరి రకాలపై పరిశోధనలు జరుగాలి
రైతును రాజుగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే కాళేశ్వరం నీటిని మెట్టప్రాంతాలకు తెచ్చింది. బీటలు వారిన మా భూముల్లో బంగారం పండేలా చేసింది. అయితే, ప్రభుత్వం ఆశించిన మేరకు మేలైన వంగడాల సృష్టి జరుగడం లేదు. దీంతో, మిల్లింగ్ సమయంలో ధాన్యంలో 30శాతానికి పైగా నూకలు వస్తున్నాయి. అటు కొనుగోళ్లలో వ్యాపారుల తిరకాసు, అధిక ఉత్పత్తి కూడా సమస్యలకు మూల కారణమవుతున్నది. నూకలు రాని వంగడాలు సృష్టించేందుకు శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపాల్సిన అవసరముంది.
– గూడూరు మల్లారెడ్డి, రైతు, ఇప్పల నర్సింగాపూర్
సాగు సమస్యలకు పరిష్కారం
శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు పొందుతున్న. నీటి యాజమాన్య పద్ధతులు, చీడ, పీడల నివారణపై అధికారులు ఫోన్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వ సూచనతో మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణమైన పంటల సాగు చేస్తున్న. పంట మార్పిడి విధానం పాటిస్తుండడంతో ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయి.
– వంగల వెంకటరెడ్డి, రైతు, సిర్సపల్లి గ్రామం
పత్తి సాగు రైతులకు మేలు
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు రైతులు మూస పద్ధతులు వీడాలి. వరికి బదులు పత్తి పంట సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు ఆర్జించవచ్చు. బీటీ పత్తిని మించి చీడ, పీడలను తట్టుకునేలా హెచ్‌టీ బీటీ పత్తి విత్తనాలు పరిశోధన దశలో ఉన్నాయి. మరో రెండేళ్లలో ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. కలుపు యాజమాన్య పద్ధతులతో పత్తి సాగులో పెట్టుబడుల భారం తగ్గించవచ్చు. మార్కెట్లోకి వస్తున్న చట్టబద్ధత లేని విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దు.
–డా.భీమిరెడ్డి పద్మజ, ప్రొ.జయశంకర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త