ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. ఊరూరా ప్రత్యేకాధికారులు మువ్వన్నెల పతాకాలను ఆవిష్కరించారు. కరీంనగర్ సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్లలో అనురాగ్ జయంతి, జగిత్యాలలో యాస్మిన్ బాషా, పెద్దపల్లిలో ముజామ్మిల్‌ఖాన్ జాతీయ జెండాలను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి వేడుకలకు హాజరైన వారినుద్దేశించి ప్రసంగించారు. వేడుకల్లో భాగంగా కళాకారులు ఆటపాటలతో హోరెత్తించారు.
స్వరాష్ట్ర సాధన స్ఫూర్తితో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తున్నదని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. అందరి సహకారంతో జిల్లాను సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఈ యాసంగి సీజన్లో 2,03,096 మంది రైతులకు రూ.182కోట్ల 12లక్షల ఐదువేలు పెట్టుబడి సాయంగా అందించినట్లు వెల్లడించారు. సరిపడా విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నామని నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌పోర్స్ బృందాలతో నిరంతరం తనిఖీలు చేయిస్తున్నట్లు చెప్పారు.
పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలో 2023-24 సంవత్సరానికి సంబంధించి వానకాలం, యాసంగి సీజన్లో 4 లక్షల 86వేల 603 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 45 వేల మంది నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీరికి రూ.1,071 కోట్ల మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా నేరుగా చెల్లించామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల గురించి వివరించారు. అనంతరం వేడుకల ముగింపులో భాగంగా మహిళల కోలాట నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కళాకారుల పాటలు లు అలరించాయి. కరీంనగర్లో జరిగిన వేడుకల్లో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో కే మహేశ్వర్, మేయర్ యాదగిరి సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ బీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దు తామని, ముఖ్యంగా రామగిరిఖిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం పదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. ప్రజావాణి ద్వారా ప్రజలకు సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

మహాలక్ష్మి కింద అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లాలో ఇప్పటి వరకు 88.56 లక్షల మంది వినియోగించుకున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పెద్దపల్లిలో జరిగిన వేడుకల్లో అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్, ఏసీపీ జీ కృష్ణ, పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య పాల్గొన్నారు.
ఎందరో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. తెలంగాణ సిద్ధించి పదకొండో వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ఆవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ పదేండ్లలో రాష్ట్రం అన్నింటా ప్రగతి పథంలో పయనించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.

జిల్లాలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సమర్థ వంతం గా పనిచేసి విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగులు, అధికారులు, పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. భవిష్యత్తులో ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. సిరిసిల్లలో జరిగిన వేడుకల్లో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జడ్పీ చైర్పర్సన్ అరుణ, జడ్పీ సీఈవో ఉమారాణి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేశ్, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
అమరుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ఈ పదేండ్లలో అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిచిందని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. మన ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. తెలంగాణ అనేక చారిత్రక ప్రదేశాల సమాహారమని చెప్పారు.

ప్రజలందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నా మన్నారు. ముఖ్యంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత, మహిళా, జర్నలిస్టులకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు జగిత్యాల పట్టణంలోని అమరుల స్తూపం వద్ద ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి నివాళులర్పించారు.