తెలంగాణ ఉద్యమ కళాకారుడు, గాయకుడు, కవి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ ఇక లేరన్న వార్తను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. గురువారం ఉదయం ఆయన మరణ వార్తవిని తీవ్ర ద్రిగ్భాంతికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలోనే కాదు.. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన పాత్ర గొప్పదని ప్రశంసిస్తున్నారు. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప గాయకుడిని, భవిష్యత్తు నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఉద్యమంలో తన పాట, మాటలతో జనాన్ని చైతన్య పర్చిన సాయిచంద్, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైనా పాటలు రాసి, సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో తన గొంతు వినిపించిన గొప్ప కళాకారుడని కీర్తిస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు నాయకులు హైదరాబాద్‌లోని గుర్రంగూడలో గల సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కరీంనగర్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో తన గానంతో ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించిన గొంతు మూగబోయింది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై చైతన్య పరిచిన ఆ స్వరం ఆగిపోయింది. కేసీఆర్ సభ ఉందంటే ముందుగా తన పాటలతో హోరెత్తించే సాయిచంద్ గొంతు చప్పుడు నిలిచిపోయింది. ప్రముఖ కళాకారుడు, కవి, రచయిత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వీదా సాయిచంద్ ఆకస్మిక మరణంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానీకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో సాయిచంద్ కళాకారుడిగా ఉద్యమ గేయాలు పాడుతూ ప్రజలను చైతన్య పర్చారు. కరీంనగర్ జిల్లా నాయకులు, కళాకారులకు సుపరిచితుడైన సాయిచంద్ 2011 నుంచి ఉద్యమంలో నేరుగా పాల్గొంటూ తెలంగాణ ప్రజలు పడుతున్న గోసలను అందరికీ అర్థమయ్యే విధంగా తన యాసలో చెప్పుకుంటూ చైతన్య పర్చారు. 2011లో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన అప్పటి టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్త బంధం విలువ నీకు తెలియదురా’ అని తన గొంతెత్తి పాడినప్పుడు సభలో ఉన్న వాళ్లే కాకుండా వేదికపై ఉన్న ఉద్యమ నేత కేసీఆర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే పాటను మరోసారి పాడించుకుని తనివి తీరా విని ఆయనను అభినందించారు.
అక్కడి నుంచి మొదలైన సాయిచంద్ పాట ప్రస్థానం అనేక సభలు, సమావేశాల్లో ఎలుగెత్తి సాగింది. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో జరిగిన అనేక సభల్లో ఆయన పాడిన ఉద్యమ పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన బీఆర్ఎస్ కళాకారుడిగా గుర్తుండి పోయారు. కేసీఆర్ సభ జరిగే ప్రతి చోటా సాయిచంద్ గొంతు తప్పక వినిపించేది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్వయంగా రాసిన అనేక పాటలను సామాన్యులకు బోధపడేలా వర్ణిస్తూ తన గొంతు ద్వారా వినిపించేవారు.
కేసీఆర్ ఎక్కడికి వస్తే అక్కడికి..
కరీంనగర్ జిల్లాతో సాయిచంద్‌కు విడదీయలేని బంధం ఏర్పడింది. తెలంగాణ మట్టి మలిచిన ఈ తరం కళాకారుడిగా సాయిచంద్ జిల్లా ప్రజలకు సుపరిచితుడు. జిల్లాలో సీఎం కేసీఆర్ నిర్వహించిన రాజకీయ, ప్రభుత్వ సభల్లో ఆయన ప్రత్యక్షమయ్యేవారు. కేసీఆర్ సభ ఎక్కడ ఉంటే అక్కడ సాయిచంద్ గొంతు వినిపించేది. 2017లో జరిగిన హరితహారం సభలో పాల్గొని పాటలు పాడారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేసిన ప్రతీ సభలో సాయిచంద్ తన గొంతును వినిపించారు. పాడటమే కాకుండా ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా మాటల తూటాలు పేల్చేవారు.
2019లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్‌లోని మానేరు తీరం నుంచి ప్రారంభించిన పార్లమెంట్ ఎన్నికల శంఖారావంలో సాయిచంద్ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ సాయిచంద్ తన పాటలతో ప్రజలను కట్టిపడేసేవారు. సాయిచంద్ పాట అనగానే జనం ఈలలు, కేరింతలతో ఉర్రూతలూగే వారు. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, తదితర మండల కేంద్రాల్లో జరిగిన ఉప ఎన్నిక ప్రచార సభల్లో సాయిచంద్ తన పాటలు, మాటలతో బీఆర్ఎస్ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆయన లేని సభ ఉండేది కాదు. సభలకు తరలివచ్చిన జనాన్ని గంటల తరబడి కూర్చోబెట్టి వారితో కోరస్ చెప్పిస్తూ పాటలు పాడేవారు.
నివాళులర్పించిన నాయకులు
సాయిచంద్ మృతి వార్త విన్న వెంటనే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నాయకులు హైదరాబాద్‌లోని గుర్రంగూడలో గల ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్, మండలి చీఫ్‌విప్ టీ భానుప్రసాదరావు, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా పరిశీలకుడు, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరుమల్ల రాకేశ్ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, పునర్నిర్మాణంలో సాయిచంద్ కీలకంగా పనిచేశారని, ఆయన మృతి బీఆర్ఎస్కు, రాష్ర్టానికి తీరని లోటన్నారు. బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంభాల మల్లారెడ్డి సంతాపం తెలిపారు.
సాయిచంద్ మృతి తీరనిలోటు
తన పాట మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని పదునెకించిన గాయకుడు సాయి చంద్ మృతి రాష్ట్రానికి తీరని లోటు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా కొనసాగుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో సైతం ప్రజలను చైతన్యపరుస్తున్న సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నా. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో యువకుడిగా, గాయకుడిగా రాష్ట్ర పునర్నిర్మాణంలో సైతం సాయిది విస్మరించలేని పాత్ర. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. జోహార్ సాయి చంద్.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
నా పాటలో సగమైనోడు
సాయచంద్ మరణాన్ని జీర్ణించులేక పోతున్న. ఆయనతో నాకున్న అనుబంధం అంతలా పెనవేసుకుపోయింది. తెలంగాణ ఉద్యమంలో నాతో భాగమైనోడు. ధూంధాంలో నాతో దరువైనోడు. నా పాటలో సగమైనోడు. తెలంగాణ రాష్ట్ర సాధన వరకు నాతో కలిసి వేల మైళ్ల దూరం ప్రయాణం చేసి, కోట్లాది ప్రజలను జాగృతం చేసినోడు. ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా.. ఆకలిని చంపుకుని, ఆత్మగౌరవం కోసం నాతో కలిసి పోరాటం చేసినోడు. యువ నాయకుడు, అతి చిన్న వయస్సులోనే కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న వాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎంతో ఇష్టమైనవాడు. అకస్మాత్తుగా మమ్మల్ని వదిలి పోవడమనేది చాలా విషాదకరం. తెలంగాణ రాష్ట్రం కోసం చివరి వరకు పోరాడిన సాయిచంద్ బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకునే సమయంలో పాటై నడవాల్సిన వాడు మమ్మల్ని వదిలి వెళ్లడం చాలా బాధాకరం. ఎంతో మంది అమరుల మీద పాటలు పాడిన సాయిచంద్ అమరత్వం మీద మేము పాట పాడాల్సి రావడం దురదృష్టకరం. సాయిచంద్ భౌతికంగా లేక పోయినా కోట్లాది ప్రజల గుండెల్లో పాటై నిలుస్తడు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి చైర్మన్
కేసీఆర్‌నే కంట తడి పెట్టించాడు
మనిషిగా పుట్టడమే వరమైతే సాయిచంద్ లాంటి కళాకారుడిగా పుట్టడం మరింత గొప్ప వరం. ఆయన తెలంగాణ మట్టి మలిచిన ఈతరం కళాకారుడు. తెలంగాణ రాష్ర్టానికి గొప్ప వరం. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్త బంధం విలువ నీకు తెలియదురా అని 2011లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సాయిచంద్ పాడిన పాటకు ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో మేమంతా అదే వేదికపై ఉన్నాం. ఆ పాట విని ఏడ్వని వారు లేరు. అంత గొప్పగా పాడాడు. కేసీఆర్ మరోసారి పాటించుకుని తనివితీరా విన్నారు. ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్య పర్చడంలో ఆయన పాట ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సుస్థిరత కోసం పాడిన పాటలకు అంతే ప్రాధాన్యత ఏర్పడింది. అది పార్టీ సభ అయినా, ప్రభుత్వ సభ అయినా కేసీఆర్ వస్తున్నారంటే సాయిచంద్ గొంతు వినిపించాల్సిందే. ఆయన లోటు తీరనిది.
– నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ
తెలంగాణ ఉద్యమ కళాకారుడు, గాయకుడు, కవి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ ఇక లేరన్న వార్తను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. గురువారం ఉదయం ఆయన మరణ వార్తవిని ద్రిగ్భాంతికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలోనే కాదు.. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన పాత్ర గొప్పదని ప్రశంసిస్తున్నారు. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప గాయకుడిని, భవిష్యత్తు నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఉద్యమంలో తన పాట, మాటలతో జనాలను చైతన్య పర్చిన సాయిచంద్, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైనా పాటలు రాసి, సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో తన గొంతు నుంచి వినిపించిన గొప్ప కళాకారుడని కీర్తిస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు నాయకులు హైదరాబాద్‌లోని గుర్రంగూడలో గల సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన పార్థీవ దేహానికి పూలమాల వేసి నేరుగా నివాళులర్పించారు.
సాయిచంద్ మృతి తీరని లోటు
మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని తన పాటలతో ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు సాయిచంద్. ఆయన మృతి తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు చిన్న వయసులోనే అకాల మరణం చెందడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవుడిని కోరుకుంటున్నా.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
ఉద్యమానికి ఊపిరిగా పాటలు
తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాడిన పాటలు ఎవరూ మర్చిపోరు. ఆయన లాంటి ఎందరో కళాకారులు ఉద్యమంలో పాడినా సాయిచంద్ పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన పాటలే ఉద్యమానికి ఊపిరులూదాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనతో నాకు వ్యక్తిగత సంబంధాలున్నాయి. నాకు మంచి మిత్రుడు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కలిసి పనిచేశాం. ఆయన పాట ఎంత పదునుగా ఉంటదో మాట కూడా అంత పదునుగా ఉంటది. పాటల ఒరవడిని మాటల తూటాలను పేల్చుతూ పాడే పాటలు మంత్ర ముగ్ధుల్ని చేసేవి. ఉద్యమ పాటలే కాకుండా సామాజిక గీతాలు కూడా అనేకం ఆలపించి జనంలో చైతన్యం రగిలించారు.. ఆయన లేని లోటు తీర్చ లేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్న.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
ఉద్యమంలో చురుకైన పాత్ర
సాయిచంద్ మృతి తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు. ఈ ఘటన నాకు దిగ్భ్రాంతిని కల్గించింది. ఆయన ఆత్మకు స్వర్గప్రప్తి కలగాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సాయిచంద్ తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించి గాయకునిగా అందరి మన్ననలు పొందాడు. ఉద్యమ పాటలతో ప్రజలను ఆలోచింపజేసిన మిత్రుడి అకాలమరణం తీరని లోటు.
– డాక్టర్ సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
యావత్ తెలంగాణకే తీరని లోటు
ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంకుల సంస్థ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మృతి యావత్ తెలంగాణకే తీరని లోటు. తన ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప గాయకుడు. తెలంగాణ ఆవశ్యకతను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. గొప్ప భవిష్యత్తు ఉన్న సాయిచంద్ గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందడం చాలా బాధాకరం.
– పుట్ట మధూకర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్
సిరిసిల్ల వేదికలపై చైతన్య గీతాలు
“రాజన్న సిరిసిల్ల గడ్డమీద.. ఆయన నాయకుడిగా ఉన్న నేల మీద.. రామన్నను అందరి లాగా.. సామాన్యంగా వేదికపై పిలిస్తే బాగుండది..ఉరుకుతున్న గులాబీ దండు మీద ఎగురుతున్న జెండా కేసీఆర్.. ఆ గులాబీ జెండాకు గుండె బలమే మన అన్న కేటీఆర్.. కల్వకుంట్ల వారసుడు కత్తిలాంటి నాయకుడు.. కారు గుర్తు జెండాలెత్తి కదలివచ్చినాడు.. కార్యనిర్వాహక అధ్యక్షుడైనాడు .. జై రామన్న” అంటూ సిరిసిల్లలో 2022 ఫిబ్రవరి 18న సాయిమణికంఠ ఫంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సాయిచంద్ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానం పలికిన పాట పార్టీకి చెందిన ప్రతి నేత, కార్యకర్తల గుండెల్లో నిలిచిపోతుంది. ఇలా సిరిసిల్ల వేదికలపై ఆయన తన పాట, మాటలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 12న తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వచ్చిన ఆయన వేదికపై సాయిచంద్, మంత్రి కేటీఆర్ కోరిక మేరకు రైతులనుద్దేశించి “అరవై ఏండ్ల నాటి గడ్డుకాలం.. కరువుతో తల్లడిల్లే ఆరుగాలం.. గత పాలకుల పాపాలన్నీ తుడిచి.. రైతుకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపే… వచ్చేసింది రైతుల బతుకుల్లో పున్నమి .. రైతే రాజయ్యే రోజు చేరవయ్యే.. కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో” అంటూ పాటతో అలరించారు. అదే రోజు సాయంత్రం ముస్తాబాద్ మండలంలోని మెట్టబండ సమీపంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తన పాటలతో కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు .
గతేడాది ఆగస్టు 29న సీఎం కేసీఆర్ పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆటోనగర్ ఏరియాలో నిర్వహించిన సభలో సాయిచంద్ పాటలు ఆలోచింపజేశాయి. ఆయన మాట, పాటలకు పార్టీ శ్రేణులు, ప్రజలు పదం పాడి.. కదం తొక్కారు. ‘జబ్బకు సంచీ చేతుల జెండా జాతర పోదమా.. గులాబీ జాతర చేద్దమా..’ పాటకు చేతిలో బీఆర్ఎస్ జెండాలను పట్టుకొని చిందులేశారు. ‘’కోట్ల గొంతుకలను ఏకం చేసిందిర జెండా.. కేసీఆరు ఎగరేసిన ఈ గులాబీ జెండా.., ‘మానవతకు మారుపేరు మన కేసీఆరు సారు.. మల్ల మల్ల రావాలి మనసుగల్ల సర్కారు.., “ఘల్లు.. ఘల్లు.. ఘల్లు.. గజ్జెల బండీ.. మన కేసీఆరు నడుపుతున్న మువ్వల బండీ..” అనే పాటలు కార్యకర్తలతో నృత్యాలు చేయించాయి. ఆ సమయంలో సందర్భానికి తగ్గట్టుగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పులు మోసిన ఘటనను గుర్తు చేస్తూ సాయిచంద్ పాడిన “గుజరాతోని చెప్పులు మోసిన.. బాంచెన్ బండి సంజయ్.. ఆత్మగౌరవ తెలంగాణలో ఇక నీకేం పని ఇక వెళ్లోయ్..” అని పాడిన పాటకు కార్యకర్తలు నృత్యాలు చేశారు. ఇలా ఒక్కో పాటతో ఒక్కో విధంగా ప్రజలను తనవైపు తిప్పుకునేవారు.