పెద్దపల్లి, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొత్త చిచ్చు మొదలైంది. డిప్యూటేషన్‌పై ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు రావడంతో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కేజీబీవీల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమ డిమాండ్ల సాధనకు 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చదువులకు ఆటంకం ఏర్పడుతుండడం, వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండడంలో విద్యార్థినులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సమీప ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించాలని సర్కారు నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేయడంతో నిరసన వ్యక్తమవుతున్నది.
దీంతో సమ్మెకు దిగిన సర్వ శిక్షా ఉద్యోగులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై స్పందించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు తాము సమ్మెలో ఉన్నా ఒకరిద్దరు కేజీబీవీల్లో ఉంటున్నారని, ప్రభుత్వ టీచర్లు బోధించి వెళ్తే ఎవరు ఉంటారని ప్రశ్నిస్తున్నారు. తాము సమ్మెలో ఉన్నా.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కేజీబీవీలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఒక్కో కేజీబీవీలో ఒకరు, ఇద్దరు ఉండి సంరక్షిస్తున్నామన్నారు. ఇక కేజీబీవీలకు తాళాలు వేసి ఎంఈవోలకు అప్పగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను పంపిస్తే అక్కడ సైతం నష్టపోయే ప్రమాదముందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పురుష టీచర్లు!
ప్రభుత్వ స్కూళ్ల టీచర్లను డిప్యూటేషన్ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయులు కేజీబీవీల్లో బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాల్వశ్రీరాంపూర్ కేజీబీవీలో ప్రభుత్వోపాధ్యాయుడు రాజమౌళి, రామగుండంలో రామకృష్ణ, జూలపల్లిలో లక్ష్మీపతి, ముత్తారంలో బాలరాజు, రవి శ్రీనివాస్‌ను నియమించినట్టు తెలిసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కస్తూర్బా స్కూళ్లకు పురుష టీచర్లను పంపించడాన్ని విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యావంతులు తప్పుపడుతున్నారు. కాగా, సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కస్తూర్బాకు శనివారం డిప్యూటేషన్‌పై ఐదుగురు ప్రభుత్వ టీచర్లు వెళ్లగా, ‘మీరు మాకు వద్దు.. మాకు మా పాత టీచర్లే కావాలి. మీరు వెళ్లండి’ అంటూ విద్యార్థినులు వాగ్వాదానికి దిగారు. దీంతో సహనం కోల్పోయిన ఓ ఉపాధ్యాయురాలు ఏడో తరగతి విద్యార్థిని నిహారికపై చేయి చేసుకోవడం దుమారం రేపగా, మిగతా విద్యార్థినులందరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. స్కూల్ ఆవరణలో ఆందోళన చేశారు.