సర్దుబాటులో భాగంగా మరో పాఠశాలకు వెళ్లిన పలువురు ఉపాధ్యాయులు, యథాస్థానంలో ఉండేందుకు చేసిన పైరవీ బెడిసి కొట్టింది. ఓ జాతీయ పార్టీ నాయకుడి ద్వారా ఫోన్ చేయించుకొని వెళ్లిన సదరు టీచర్లకు ఏకంగా కలెక్టరే పరీక్ష పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన చాంబర్లోకి వచ్చిన గురువులను మాటల్లో పెట్టి.. వారి ద్వారానే ఎవరూ ఏ సబ్జెక్టులు బోధిస్తారో తెలుసుకొని, ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను చేతిలో పెట్టారు.
వీటికి సమాధానాలు రాసుకొని రావాలని, అప్పుడు మీ సమస్య గురించి మాట్లాడుదామంటూ చెప్పడంతో సదరు పంతుళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అందులో నుంచి తేరుకోక ముందే.. ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి మీకు ఎంత సమయం పడుతుందని మరో ప్రశ్న రావడంతో విస్తుపోయారు. ఇప్పుడే రాసుకొని వస్తామంటూ బయటకు వచ్చిన సదరు పంతుళ్లకు.. అక్కడ మరో అధికారి చెప్పిన విషయాలు విని మైండ్‌బ్లాంక్ అయింది. మళ్లీ లోపలికి వెళ్తే తమ ఉద్యోగానికే ప్రమాదమని గ్రహించిన సదరు టీచర్లు అక్కడి నుంచి జారుకున్నట్టు తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాల్లో ఈ విషయం హాట్‌టాపిక్‌లా మారింది.
కరీంనగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోనూ సర్దుబాటు ప్రక్రియ చేసిన విషయం విదితమే. నిజానికి ఈ విద్యాసంవత్సరం బడిబాట కార్యక్రమాన్ని జూన్ 6 నుంచి 19వరకు నిర్వహించాలని ప్రభు త్వం ఆదేశాలు ఇచ్చింది.
అయితే సర్దుబాటు ప్రక్రియ మాత్రం జూ న్ 13 తేదీకే పూర్తి చేయాలంటూ మరో ఉత్తర్వును జారీచేయడంతో అప్పట్లో రాష్ట్ర విద్యాశాఖపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జూన్ 19న బడిబాట ముగుస్తుంటే 13నాటికే సర్దుబాటు ఎలా పూర్తి చేస్తారంటూ వచ్చిన ప్రశ్నల నేపథ్యంలో జూలై 15 వరకు పొడిగిస్తూ సర్కారు మరోసారి ఆదేశాలు ఇచ్చింది.
అంతేకాదు, సర్దుబాటు చేసిన వివరాలను జూలై 22లోగా రాష్ట్ర విద్యాశాఖకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే సర్దుబాటు ప్రక్రియను పూర్తిగా కలెక్టర్లకు అప్పగించింది. ఆయా జిల్లాల విద్యాధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా చేసుకొని, పిల్లల సంఖ్యను పరిగణలోకి తీసుకొని, టీచర్లు లేని పాఠశాలకు సర్దుబాటు కింద పంపించారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 300కుపైగా ఉపాధ్యాయులను సర్దుబాటు కింద వేర్వేరు పాఠశాలలకు పంపించారు.
పైరవీ చేసిన ఉపాధ్యాయులు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో 300కుపైగా ఉపాధ్యాయులను ఆయా జిల్లాల కలెక్టర్లు సర్దుబాటు చేశారు. దీంతో ప్రస్తుతమున్న స్థానం నుంచి మరోస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి సదరు టీచర్లకు ఏర్పడింది. అందులోనూ కొంతమంది దూరం వెళ్లక తప్పలేదు. దాదాపు అన్నీ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నా, ఓ జిల్లాలో మాత్రం కలెక్టర్ ఆయనకు నచ్చినట్టు సర్దుబాటు ప్రక్రియ చేశారన్న విమర్శలున్నాయి. దీంతో ఓ జాతీయ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నామంటూ చెప్పుకొన్న కొంత మంది పంతుళ్లు, సదరు జాతీయ పార్టీ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి.. సర్దుబాటులో తమకు అన్యాయం జరిగిందని చెప్పుకొన్నారు.
తమను దూరం పాఠశాలలకు పంపించారని, వాటిని రద్దు చేసి యథాస్థానంలో ఉండేలా కలెక్టర్‌ను ఆదేశించాలని కోరారు. దాంతో ఆ ప్రజాప్రతినిధి సదరు కలెక్టర్‌కు ఫోన్ కలిపారు. ‘సర్దుబాటులో మా వాళ్లకు చాలా అన్యాయం జరిగిదంటున్నారు. సదరు టీచర్లను తిరిగి యథాస్థానంలో ఉండేలా చూడండి’ అని చెప్పారు. ‘అయ్యో అలా జరిగిందా..?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన కలెక్టర్, ‘వాళ్లను వెంటనే నా వద్దకు పంపండి. నేను చూస్తా’నని చెప్పారు. ఆ మేరకు టీచర్లందరూ కలిసి కలెక్టర్ వద్దకు వెళ్లి తన పేరు చెప్పాలని ప్రజాప్రతినిధి అనడంతో, సదరు పంతుళ్లు సంతోషపడ్డారు. మీ పని తప్పకుండా అవుతుందని ప్రజాప్రతినిధి చెప్పిన మాటలు విని సంబురపడ్డారు.
ఎగ్జామ్ పెట్టిన కలెక్టర్
ప్రజాప్రతినిధి ఇచ్చిన భరోసాతో సదరు ఉపాధ్యాయులు మరుసటి రోజు ఉదయం 11 గంటల సమయంలో కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడున్న సీసీని కలిసి, ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఆయన పంపించారని, వారి రెఫరెన్స్ కలెక్టర్‌కు చెబితే తమను పిలుస్తారని చెప్పడంతో సీసీ అదే పని చేశారు. వెంటనే కలెక్టర్ ఆ టీచర్లను లోపలికి పిలిపించారు. కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ పంతుళ్లను మాటల్లో దింపి, వారు బోధించే సబ్జెక్టుల వివరాలు తెలుసుకున్నారు.
‘మీరుపాఠాలుబాగా చెబుతారా..?’ అని అడుగగానే.. ‘అవును సర్’ అంటూ అంతా తలూపారు. అంతలోనే కలెక్టర్ తన టేబుల్ డ్రాయర్ నుంచి కొన్ని పేపర్లను తీసి, వారి వారి సబ్జెక్టులకు అనుగుణంగా ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టారు. సదరు పేపర్లను అందుకున్న టీచర్లు వాటిని తిరిగేసి చూస్తే.. అందులో వారు బోధించే సబ్జెక్టులకు సంబంధించిన క్వచ్ఛన్స్ ఉన్నాయి. వాటిని చూసి షాక్ గురై ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుండగానే.. ‘ఒక పనిచేయండి.
ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసుకొనిరండి. ఆ తర్వాత మీ సర్దుబాటు గురించి మాట్లాడుదాం’ అని కలెక్టర్ చెప్పడంతో కంగుతిన్నారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే.. ‘ఈ సమాధానాలు రాయడం మీకు చాలా సులువు అనుకుంటా! ఎందుకంటే మీరు అందులో పండితులు కదా! అవును ఈ సమాధానాలు రాయడానికి మీకు ఎంత సమయం పడుతుదంటారు?’ అంటూ మరో ప్రశ్న రావడంతో మరోసారి విస్తుపోయారు. తేరుకొని ఇప్పుడే రాసుకొని వస్తామంటూ బయటికి వచ్చారు.
విషయం తెలిసి పలాయనం
కలెక్టర్ ఇచ్చిన పేపర్లు తీసుకొని చాంబర్ నుంచి బయటకు వచ్చిన ఉపాధ్యాయులను గుర్తించిన ఓ అధికారి, వారిని తన కార్యాలయంలోకి పిలిపించారు. ‘మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు?’ అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతా విన్నాక ‘ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. ‘ప్రశ్నలు టఫ్‌గానే ఉన్నాయి. అయినా మా ప్రయత్నం చేస్తాం’ అంటూ ఆ టీచర్లు చెప్పిన మాటలు విని గట్టిగా నవ్వారు. సర్ ఎందుకు నవ్వుతున్నారని అడగడంతో.. ఆయన అసలు విషయం విప్పి చెప్పారు.
నిజంగానే మీకు పనిచేసి పెట్టాలన్న ఉద్దేశమే కలెక్టర్‌కు ఉంటే.. ‘ఈ పరీక్ష ఎందుకు పెడుతారు? పోనీ మీరు ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసుకొని వెళ్లినా అందులో తప్పులు కచ్చితంగా వెదుకుతారు? అలాగే ఒకవేళ మీరు తప్పిపోయి తప్పుడు సమాధానాలో రాశారో మీకు పాఠాలు చెప్పే సామర్థ్యం లేదు. సామర్థ్యం లేని వారిని ఉపాధ్యాయులుగా కొనసాగించడం మంచిది కాదంటూ ఏకంగా మీపై ప్రభుత్వానికి రిపోర్టు పెడుతారు.
అసలు కలెక్టర్ గురించి మీకు పూర్తిగా అర్థం అయినట్టు లేదు’ అని చెప్పడంతో సదరు టీచర్లు కంగుతిన్నారు. సమాధానాలు రాసుకొని వెళ్తే అసలు ఉద్యోగానికే ఎసరొచ్చే ప్రమాదముందని భావించి, అక్కడి నుంచి చెప్పాపెట్టకుండా పలాయనం సాగించారు. కలెక్టర్ వద్ద జరిగిన విషయాన్ని ఆ పంతుళ్లు వెళ్లి ప్రజాప్రతినిధికి వివరించగా, ‘నేను చెప్పినంక కూడా ఇట్ల చేసిండా..?’ అంటూ షాక్‌కు గురైనట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారం కొద్ది రోజుల క్రితం జరిగినా ప్రస్తుతం బయటకు పొక్కడంతో ఉపాధ్యాయవర్గాల్లో హాట్‌టాపిక్‌లా మారింది. సదరు జాతీయ పార్టీ ప్రజాప్రతినిధికి కూడా అసలు విషయం తెలియడంతో సదరు కలెక్టర్ తీరుపై మండిపడుతున్నట్టు సమాచారం.