indecent behavior | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 19: తంగళ్లపల్లి మండలం ఓ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో బాలికలతో ఓ ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన మండలం లో కలకలం రేపింది. బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేతలు పాఠశాలలో శుక్రవారం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బీజేపీ నేతలను సముదాయించారు. అక్కడి నుంచి వెళ్లగొట్టి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆ ఉపాధ్యాయుడి తీరి అంతే..!
తంగళ్ళపల్లి మండలంలోని ఓ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఓ స్కూల్ అసిస్టెంట్ తీరు ఆది నుంచి అదే తీరు అని గ్రామస్తులు తెలిపారు. 2022 నుంచి పనిచేస్తున్న ఆ ఉపాధ్యాయుడు బాలికలతో పలు మార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు గతంలో మందలించారు. బాలికల తల్లిదండ్రులతో క్షమాపణ సైతం చెప్పడంతో వదిలేశారు. తాజాగా మరో విద్యార్థిని ఏ పౌడర్ వేసుకుంటామంటూ వెకిలి చేష్టలు, అసభ్యంగా ప్రవర్తించడంతో సదరు తల్లిదండ్రులు గురువారం పాఠశాలకు చేరుకొని మందలించారు.
బీజేపీ నేతలు ఆందోళన చేయడంతో సదరు ఉపాధ్యాయ తీరుపై మరోసారి చర్చనియాంశమైంది. ఈ విషయంపై ఎంఈఓ రాజు వివరణ కోరగా, తల్లిదండ్రులు పాటు బీజేపీ నేతలు ఆందోళన నేపథ్యంలో విచారణ చేసి, విషయంపై డీఈవో కు రిపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు.