Badi Bata | చిగురుమామిడి, మే 30: మండలంలోని చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ముల్కనూర్ తదితర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం గ్రామంలో విద్యార్థులతో కలిసి 2025- 26 విద్యా సంవత్సరానికి విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు గ్రామంలో ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకతను, మౌలిక వసతులను, బోధన విధానాలను విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటింటా వివరించారు.
కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు ఉన్నతమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని వివరించారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవాలని గ్రామస్తులను ఉపాధ్యాయులు కోరారు. ఇంటింటా తిరిగి విద్యార్థులను పాఠశాలలో చేర్పించుటకు పేర్ల నమోదు చేసుకున్నారు. జూన్ 2 నుండి ప్రతిరోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారిని వి. పావని తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు ఎమ్మార్సీలోకి వచ్చి సిద్ధంగా ఉన్నాయన్నారు.