పెద్దపల్లి జిల్లా ప్రజలకు మరిన్ని సర్కారు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్కానింగ్, పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పనిలేకుండా జిల్లా కేంద్రంలో ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా 134 రకాల రక్త, మూత్ర, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.
పెద్దపల్లిలో టీ-హబ్, డయాలసిస్ కేంద్రం
త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధం
1.5 కోట్లతో భవన నిర్మాణం, పరికరాల బిగింపు, సిబ్బంది నియామకం పూర్తి
అందుబాటులోకి రానున్న 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు
పెద్దపల్లి జిల్లా ప్రజలకు మరిన్ని సర్కారు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్కానింగ్, పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పనిలేకుండా జిల్లా కేంద్రంలో ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా 134 రకాల రక్త, మూత్ర, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. జిల్లా దవాఖాన ఆవరణలో రూ.1.5 కోట్లతో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్ సెంటర్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. మరోవైపు దవాఖాన ఆవరణలోనే ఐదు పడకల సామర్థ్యంతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, త్వరలోనే ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేశారు.
– పెద్దపల్లి, జూన్ 26(నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్ (టీ-హబ్) సెంటర్, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసింది. టీ-హబ్ కోసం 1.5 కోట్లు భవన నిర్మాణానికి, 50 లక్షలు పరికరాల కొనుగోలుకు వెచ్చించారు. అందులో సేవలందించేందుకు సిబ్బంది నియామక ప్రక్రియను సైతం పూర్తి చేశారు. అదే విధంగా దవాఖాన ఆవరణలోనే ఐదు పడకల సామర్థ్యంతో డయాలసిస్ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటన ఖరారు కాగానే, సేవలు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టీహబ్ అందుబాటులోకి వస్తే 134 రకాల పరీక్షలను ఉచితంగా అందనున్నాయి.
ప్రైవేట్‌లో రూ.వేలకు వేలు ఖర్చు
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రైవేట్ దవాఖానకు వెళ్లినా రక్త, మూత్ర పరీక్షలు చేయడం తప్పని సరైంది. ఓపీ సేవలు సర్కారు దవాఖానల్లో ఉచితంగా అందుతున్నప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు మాత్రం పేదలు ప్రైవేట్‌లో తమ జేబు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. జ్వరం వచ్చిందని వెళ్తే తప్పనిసరిగా సీబీపీ, వైడల్, మలేరియా, యూరిన్ అనాలసిస్, తదితర పరీక్షలు చేస్తుండడంతో రూ.వేలకు వేలు ఖర్చవుతున్నాయి. వీరి బాధలు తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018 జూన్‌లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో ఆయా పరీక్షలు నిర్వహించే నిపుణులను నియమించింది. వివిధ దవాఖానల నుంచి వచ్చే శాంపిళ్లను వెంటవెంటనే పరీక్షించి రిపోర్టులను తిరిగి పంపించడంతోపాటు పరీక్షలు చేసుకున్న వ్యక్తి మొబైల్ నంబర్‌కు కూడా లింక్ మెస్సేజ్ పంపిస్తున్నారు.
జిల్లా ప్రజలందరికీ ఉపయోగం
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 18, పట్టణ ప్రాంతాల్లో 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 104 సబ్ సెంటర్ కేంద్రాలు, 3 సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎక్కడ ఎవరికి నమూనా పరీక్షలు అవసరమైనా వాటిని సేకరించి జిల్లా కేంద్రంలోని టీహబ్ డయోగ్నోస్టిక్ సెంటర్‌కు పంపనున్నారు. ఫలితంగా ఈ సెంటర్ జిల్లా ప్రజలందరికీ ఉపయోగపడనున్నది. ఇది అందుబాటులోకి వస్తే 134 రకాల పరీక్షలు చేయించుకునే అవకాశం ఉన్నది. రక్త, మూత్ర, అవయవ పనితీరు, థైరాయిడ్, లివర్, కిడ్నీ పనితీరు, కొలెస్ట్రాల్, చికున్‌గున్యా, మలేరియా, డెంగీ, టైఫాయిడ్, క్యాల్షియం, సీరమ్ క్రియాటిన్, డీహెచ్డీఎల్, ఎలొక్టోరైట్స్, హెచ్బీఎస్హెచ్జీ వంటి 134 రకాల పరీక్షలు చేస్తారు. వీటితోపాటు ఖర్చుతో కూడుకున్న సిటీస్కాన్, 2డీ ఈకో, అల్ట్రా సౌండ్, మెమొగ్రఫీ వంటి స్కానింగ్ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. రోగులు ఇచ్చే శాంపిళ్లను ప్రతిరోజూ ఒక రూట్‌గా చేసుకొని జిల్లా కేంద్రంలోని టీ హబ్ డయాగ్నోస్టిక్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాన్ని సైతం సిద్ధం చేశారు.
అందుబాటులోకి డయాలసిస్ కేంద్రం
పెద్దపల్లిలో ఎంసీహెచ్ ప్రారంభ సమయంలో మంత్రి హరీశ్‌రావుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు జిల్లా దవాఖాన ఆవరణలో ఐదు పడకలతో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేశారు. ప్రస్తుతం ఇది అందుబాటులోకి రానుండగా, పెద్దపల్లి నియోజకవర్గంలోని డయాలసిస్ పేషెంట్లు కరీంనగర్, గోదావరిఖనికి వెళ్లి డయాలసిస్ చేయించుకునే పరిస్థితి తప్పనుంది. ఈ కేంద్రంలో అన్ని రకాల పరికరాలను బిగించి సిద్ధం చేశారు.
త్వరలోనే అందుబాటులోకి సేవలు
ప్రతి పేద కుటుంబానికి ఖరీదైన వైద్యాన్ని చేరువ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇంకా వ్యాధి నిర్ధారణ పరీక్షలను సైతం ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 134 రకాల నిర్ధారణ పరీక్షలు టీ-డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా ప్రజలకు అందుతాయి. అదే విధంగా జిల్లా దవాఖానలో ఐదు పడకలతో ఉచిత డయాలసిస్ కేంద్రం సేవలు సైతం త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. టీహబ్, డయాలసిస్ కేంద్రానికి కావాల్సిన సిబ్బంది నియామకాలు, యంత్రాల బిగింపు ప్రక్రియ పూర్తయింది.
– డా. కొండ శ్రీధర్, డీసీహెచ్ఎస్ (పెద్దపల్లి)
మరిన్ని ఉచిత వైద్య సేవలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి మెరుగైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. నేను రాను బిడ్డో.. సర్కారు దవఖానకు.. అనే నానుడిని దూరం చేసి.. నేను సర్కారు దవఖానకే వస్తా.. అనే తీరుగా సర్కారు వైద్య శాలలను తీర్చిదిద్దారు. పెద్దపల్లిలో టీహబ్, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడంతో వెంటనే మంత్రి హరీశ్‌రావు మంజూరు చేశారు. త్వరలోనే ఆయన చేతుల మీదుగా టీహబ్‌ను ప్రారంభించుకోనున్నాం. ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని సైతం ప్రారంభించుకుంటాం. వీటివల్ల జిల్లా ప్రజలకు 134 రకాలైన పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి.
-దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దపల్లి
మిషనరీ అంతా సిద్ధం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన టీ డయాగ్నోస్టిక్ కేంద్రం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ల్యాబ్‌కు సంబంధించిన అన్ని యంత్రాల బిగింపు ప్రక్రియ పూర్తయింది. ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రారంభం కాగానే జిల్లా ప్రజలకు ల్యాబ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుంది.