Godavarivarikhani | కోల్ సిటీ, మార్చి 13 : రామగుండం బల్దియాలో యూజీడీ టెండర్ల అవకతవకలపై ఆరోపణలు మరోసారి తెరమీదకు రావడం చర్చనీయాంశమైంది. సీడీఎంఏ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ డ్యూటీ ఫండ్ నిధులను యూజీడీ పనులకు వినియోగిస్తున్నారని, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారని వస్తున్న, ఫిర్యాదులకు బల్దియా స్పందించకపోవడం పట్ల కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ విచారణలో ఉండగానే కాంట్రాక్టర్లు బిల్లులు కాజేసేందుకు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమై 41వ డివిజన్ సీపీఐ కార్పొరేటర్ మార్కాపురి సూర్య అతను కలెక్టర్ అరుణశ్రీకి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లు రింగు గా మారి లెస్ పర్సంటేజీలతో టెండర్లు దక్కించుకున్నారని, పైగా నాసిరకం పనులు చేస్తున్నారని, వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కార్పొరేషన్లో టీడీఎఫ్‌కు సంబంధించి రూ.13.70 కోట్ల భూగర్భ డ్రైనేజీ పనులను ఏడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఇక్కడ కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి 0.5 నుంచి 1.5 లెస్ పర్సంటేజీలతో పనులు దక్కించుకున్నారని, ఇదివరకే మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత-రాజు విజిలెన్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫైలు విచారణలో ఉండగానే యూజీడీ పనులను ఆగమేఘాల మీద చేపట్టి బిల్లులు కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.
యూజీడీ పనుల్లో ఆర్సీసీ పైపులు వినియోగించడంతోపాటు డ్రైనేజీ, చాంబర్లను నాణ్యతతో నిర్మించాలని, వర్క్ ఆర్డర్ ఉన్నా కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేస్తూ మట్టి పైపులను వాడి నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. టీడీఎఫ్ నిధులు కార్మికుల జీత భత్యాలకు, అత్యవసర పనులకు వినియోగించాలని సీడీఎంఏ నిబంధన ఉన్నప్పటికీ కమిషన్లకు ఆశపడి ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనులను ఏడు ప్యాకేజీలుగా చేసి తక్కువ లెస్ పర్సెంటీజీతో పనులు అప్పగించినట్లు వాపోతున్నారు.
పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఓ ఇంజనీరింగ్ అధికారి ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు కార్పొరేటర్ సూర్య ఆరోపించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంతో నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కార్పొరేటర్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.