ఖైరతాబాద్, జూలై 29 : ‘ఓ అధికార పార్టీకి చెందిన వ్యక్తి సీసీ రోడ్డును ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే..నా ఇంటి ప్రహరీని కూలగొట్టి ఆ రోడ్డు విస్తీర్ణాన్ని భర్తీ చేసేందుకు స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో నాపై దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నానికి పాల్పడుతున్నార’ని వికారాబాద్ జిల్లా దోమ మండలం బడెంపల్లి గ్రామానికి చెందిన బాధితుడు మంచాల శ్రీనివాస్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేస్తున్న ఆగడాలను వివరించారు. బడెంపల్లి గ్రామంలో తమకు 220 గజాల స్థలం ఉందని, 50 శాతం స్థలంలో ఇల్ల్లు..మరో 50 శాతం ఖాళీ స్థలంలో ప్రహరీ నిర్మించుకున్నామన్నారు. తమ ఇంటి స్థలం ముందు నుంచి 12 ఫీట్ల సీసీ రోడ్డు ఉందని, అయితే తమ ఇంటి ఎదురుగా ఉన్న అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఆరు ఫీట్ల రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టాడన్నారు. దీనిపై తాను ఎంపీడీవో, తహసీల్దార్, పంచాయతీరాజ్ అధికారులకు ఫిర్యాదు చేశానని బాధితుడు మంచాల శ్రీనివాస్ తెలిపారు.
ఎంపీడీవో విచారణలో రోడ్డు ఆక్రమణకు గురైనట్లు తేలినా.. బాధ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రోడ్డును ఆక్రమించిన వ్యక్తి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి రోడ్డు విస్తీర్ణాన్ని పెంచేందుకు తమ ఇంటి గోడను గతేడాది వినాయక చవితి ఊరేగింపు సమయంలో ట్రాక్టర్‌తో కూల్చివేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను పోలీసులకు బాధ్యుల పేర్లతో సహా ఫిర్యాదు చేస్తే పూర్తి వివరాలు నమోదు చేయకుండా లోపభూయిష్టంగా కేసు నమోదు చేశారని, అసలైన వ్యక్తుల పేర్లను పక్కన పెట్టారని ఆరోపించారు. ఆ తర్వాత అనేకసార్లు తమ స్థలాన్ని ఆక్రమించేందుకు అనేక యత్నాలు చేశారన్నారు. స్థానిక జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా, ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేశారు తప్ప, బాధ్యులపై స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఈ ఏడాది మార్చి 22న తాను స్వగ్రామానికి వెళ్తుండగా, సుమారు 15 మంది వ్యక్తులు బైకులు, కార్లలో వచ్చి అడ్డగించి కర్రలు, రాళ్లతో దాడి చేశారని, స్పృహ తప్పడంతో ఊరి బయట పడేసి వెళ్లిపోయారన్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, ఆస్పత్రిలో చేర్పించారని, రెండు చేతులు, తలకు తీవ్రగాయాలయ్యాయని చెప్పారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, దాడికి సంబంధించిన వీడియోలు, వాహనాల నంబర్లు, ఇతర సాక్ష్యాలున్నప్పటికీ కేవలం ముగ్గురి పేర్లనే కేసులో చేర్చి అసలైన నిందితులను తప్పించారని, వారిని స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రక్షిస్తూ.. వస్తున్నారని ఆరోపించారు.
ఈ కేసులో చార్జీషీటు ఇవ్వమని పోలీసులను అడిగితే కోర్టులో తీసుకోవాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని, వారి బెదిరింపులకు భయపడి హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, జిల్లా ఎస్పీ జోక్యం చేసుకొని కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని, దాడికి పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోవాలని, రోడ్డు ఆక్రమణపై విచారణ జరిపించాలని తమ కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు.