గోదావరిఖని, సెప్టెంబర్ 24: సింగరేణి కార్మికుల లాభాల వాటాలో కోతపై కార్మికులు మండిపడుతున్నారు. టీబీజీకేఎస్ నిరసనల్లో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఆర్జీ-1, 2, 3 ఏరియాల్లో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. టీబీజీకేఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసనకు టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంస్థ ప్రకటించిన 4,701 కోట్ల లాభాలపై 33 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆర్జీ-3 ఏరియా సెంటినరీకాలనీలో టీబీజీకేఎస్ ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల శ్రమ, త్యాగానికి విలువ లేకుండా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కార్మికులు సాధించి పెట్టిన వాస్తవ లాభాల నుంచి వాటా ఇవ్వకుండా మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు.