Maoists | సుల్తానాబాద్ రూరల్ మే04: మావోయిస్టులపై అంతిమ యుద్ధం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టింది, మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆలయ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ గాదె గుణసాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆపరేషన్ కగార్’ పేరిట అడవంతా పోలీసు క్యాంపులతో నింపేసిందన్నారు.
వేలాది పారామిలటరీ బలగాలు, గ్రేహౌండ్స్ దళాలతో దండకారణ్యాన్ని కొన్ని రోజులుగా జల్లెడ పడుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలతో అడవి అణువణువునూ శోధిస్తుందన్నారు. ఆదివాసీ గూడాలను తగలబెడుతున్నదనీ, నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ పేరిట పచ్చని అడవిలో నెత్తురుటేర్లను పరుస్తుందన్నారు. మావోయిస్టులను, అమాయక ఆదివాసీ తెగలను ఊచకోత కోస్తుందని అన్నారు. మారణహోమాన్ని సృష్టిస్తున్నదనీ, మానవహక్కుల హననానికి పాల్పడుతున్నదనీ , హింసతో, అణచివేతతో అడవిలో కల్లోలం రేపుతోందన్నారు.
గతేడాది జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్లో అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 500 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారంటే ఎంతటి భీతావహ పరిస్థితి నెలకొన్నదో అర్థం చేసుకోవచ్చుని అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన ఏ తీరుగా సాగుతున్నదో ఒక అంచనాకు రావచ్చని, మరోవైపు దండకారణ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, ఆదివాసులపై జరుగుతున్న దాడిని నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని తెలంగాణ పౌరసమాజం నుంచి అంతే స్థాయిలో డిమాండ్ పెల్లుబుకుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రజతోత్సవ సభలో లక్షలాది జనం సాక్షిగా వేదికపై నుంచి పిలుపునివ్వడంతో రాజకీయవర్గాల్లోనూ ఒక కదలిక ప్రారంభమైందని, ఇప్పటికైనా స్పందించి చర్చలు నిర్వహించాలని కోరారు.