ముస్తాబాద్, మార్చి 26 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసిన సంజయ్‌కుమార్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని కోరుతూ బుధవారం ముస్తాబాద్ ఠాణాలో ఎస్ఐ సీహెచ్ గణేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, బీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకుడు శీలం స్వామి మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దొంగ నోట్లు ముద్రించారని, ఎన్నికల్లో పంపిణీ చేశారని బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేకుట్రలో భాగంగానే నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఈ మాటల వల్ల యావత్ తెలంగాణ సమాజం అంతా మనస్తాపానికి గురైందని చెప్పారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం చూస్తుంటే గల్లీలో సిల్లీ లీడర్లా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ జహంగీర్, బైతి నవీన్, పుల్లూరి శ్రీనివాస్, కోడె శ్రీను, కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు వంగూరి దిలీప్, ఉపాధ్యక్షుడు కరెడ్ల మల్లారెడ్డి, సురేశ్, అనమేని వెంకటేశ్, ఆంజనేయులు, మెంగని కరుణాకర్ పాల్గొన్నారు.