పెద్దపల్లి, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): దశాబ్ధాల దారిద్య్రానికి, ఆకలి చావులకు, అవమానాలకు, ఆత్మ బలిదానాలకు, వివక్షకు, వెనుకబాటు తనానికి చరమ గీతం పాడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనపై బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేద పత్రం వాస్తవాలను కండ్లకు కట్టింది. చేసిన అభివృద్ధి ఏందో.. సంక్షేమ కార్యక్రమాలు ఏందో.. వెచ్చించిన మొత్తమెంతో లెక్కలతో సహా ఆవిష్కరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించిన స్వేద పత్రం.. విధ్వంసం నుంచి వికాసంవైపు, సంక్షోభం నుంచి సమృద్ధివైపు నడిపించిన తీరును ప్రజల ముందు ఉంచింది. నిజానిజాలు తెలిసేలా.. అర్థమయ్యేలా తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అసలు లెక్కలను బహిర్గతం చేసింది.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు, తర్వాత జరిగిన కుట్రలు, కుతంత్రాలు.. పసికూన కొత్త రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమానికి కలిగించిన ఆటంకాలను పటాపంచలు చేస్తూ దాదాపు 45 నిమిషాల పాటు కూలంకషంగా వివరించిన తీరు ఆలోచింపచేసింది. చేసిన ప్రతి అప్పు అభివృద్ధికి వెచ్చించినందున అది అప్పు కాదని ప్ర జలకు ఇచ్చిన ఆస్తి అనే విషయాన్ని ప్రజలు స్వాగతించారు. కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ను టీవీలకు అతుక్కుపోయి ఆసక్తిగా వీక్షించారు. చేసిన అభివృద్ధి, వెచ్చించిన నిధుల లెక్కలపై ‘అవును ప్రతి పైసా బీఆర్ఎస్ సర్కారు ప్రజల కోసమే ఖర్చు చేసింది? అనేక సమస్యలు, ప్రజావసరాలన్నీ తీర్చింది. ఇది అప్పు ఎలా అయితది? ప్రజల ఆస్తి అయితది కదా..?’ అని చర్చించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు అని ముద్రవేయడం సరికాదని సూచించారు.