వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయడం లేదన్న కోపంతో గతంలోనే షోకాజ్ నోటీసులతో బెదిరింపులకు పాల్పడిన సర్కారు, ఇప్పుడు ఏకంగా సస్పెన్షన్ వేటు వేసింది. డీసీఎస్‌ను చూపి చర్యలు తీసుకుంటే బద్నాం అవుతామని భావించి, డెత్ స్క్రీన్ రికార్డు చేయడంలో నిర్లక్ష్యం చేశారనే సాకును చూపి ఉమ్మడి జిల్లాలో 18మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజంగా తప్పు జరిగి ఉంటే ముందుగా షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాల్సి ఉన్నా.. అవేవి లేకుండానే ఆగమేఘాల మీద సస్పెన్షన్ చేయడంపై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ ఏఈవోలు మూకుమ్మడి సెలవులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయడం తమ వల్ల కాదని రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) ఇప్పటికే తేల్చిచెప్పారు. రైతు భరోసా, రైతు బీమా, పీఎం కిసాన్, పంట నష్టం సర్వే, పంట కోత ప్రయోగాలు, ధాన్యం సేకరణ, గ్రామాల వారీగా ప్రణాళిక, రుణమాఫీ కుటుంబ సర్వేల వంటి తదితర 49 రకాల విధులు నిర్వర్తిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న విధులతోనే మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా కేంద్ర నిబంధనల ప్రకారం డీసీఎస్ చేయడం తమ వల్ల కాదని వినతులు చేస్తూ వస్తున్నారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న ఏఈవోల్లో 65 శాతం మంది మహిళలే ఉన్నారని, ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఒత్తిడి తేవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయినా ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో డిజిటల్ క్రాప్ సర్వేను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో.. గణాంకాలతో సహా సర్కారుకు ఆ సంఘం వివరించింది.
ఒక్కో క్లస్టర్ పరిధిలో 15 నుంచి 20 వేల ఫామ్స్ ఉంటాయని, పెద్ద క్టస్టర్‌లో అయితే 30వేలకు పైగా ఫామ్స్ ఉన్నాయని, క్రాప్ సర్వే కింద 15వేల ఫామ్స్ ఉన్న క్టస్టర్‌లో ఒక్కోఫామ్స్కు రెండు సార్లు వెళ్లినా ఒక పంట కాలంలో ఒక ఏఈవో 30వేల సార్లు వెళ్లాల్సి ఉంటుందని, ఇది సాధ్యం అయ్యే పని కాదని, అందుకే ఇతర రాష్ర్టాల మాదిరిగా మన రాష్ట్రంలోనూ సర్వే చేయాలని కోరింది. అయినా వినకుండా అందుకు సంబంధించిన యాప్‌ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని.. పని మొదలు పెట్టాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది. తలకు మించిన భారాన్ని తాము మోయలేమంటూ ఏఈవోలు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోకపోవడంతో బెదిరింపులకు సైతం దిగింది. ఆ మేరకు ఇటీవల వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి 59 మంది ఏఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో 40 మంది ఏఈవోలు యాప్ డౌన్లోడ్ చేసుకోలేదని, క్రాప్ సర్వే విధులను నిర్వర్తించడం లేదని పేర్కొంటూ గత నెల 27, 28 తేదీల్లో గైర్హాజర్ (ఆబ్సెంట్) వేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
18 మంది సస్పెన్షన్
ప్రభుత్వ బెదిరింపులకు ఏఈవోలు దిగి రాకపోవడంతో సర్కారు సస్పెన్షన్ల ప్రక్రియకు పూనుకున్నది. అందులో భాగంగానే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఉమ్మడి జిల్లా నుంచి 18 మందిపై వేటు చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో ఐదుగురు చొప్పున ఏఈవోలు సస్పెన్షన్ కాగా, పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు అయ్యారు. డిజిటల్ క్రాప్ సర్వే చేయడం లేదనే కారణం చూపి సస్పెండ్ చేయడం సాధ్యం కాదని భావించిన సర్కారు, కొత్త కారణాలను వెతుక్కుందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సస్పెండ్ చేసిన వారందరికీ దాదాపు ఒకే కారణం చూపారు. రైతుబీమాకు సంబంధించి మరణాల విషయాన్ని ఆలస్యంగా నమోదు (డెత్స్క్రీన్ రికార్డు) చేశారని పేర్కొంటూ వారిని సస్పెన్షన్ చేశారు. నిజానికి ఒక రైతు చనిపోయిన వారం రోజుల్లో వారి కుటుంబసభ్యుల నుంచి సమాచారం వస్తే.. సదరు సమాచారాన్ని ఏఈవోలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఇచ్చే డెత్ సర్టిఫికెట్, ఆధార్ వంటివి అప్లోడ్ చేసి పరిహారం అందేలా చూస్తారు. ప్రస్తుతం సస్పెండ్ అయినా ఏఈవోల పరిధిలో ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగలేదని తెలుస్తున్నది.
నిబంధనల ప్రకారం కొంత ఆలస్యం జరిగినా.. బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే డిజిటల్ క్రాప్ సర్వేకు ససేమిరా అంటున్నారని ఏదో ఒకటి సాకుగా చూపి చర్యలు తీసుకుంటే.. అందరూ దారికి వస్తారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఇటువంటి తప్పులకు సస్పెన్షన్ చేసే ముందు సంబంధిత ఉద్యోగికి ముందుగా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. వారి నుంచి వివరణ తీసుకోవాలి. ఉద్యోగి ఇచ్చిన వివరణ సరిగా లేనప్పుడు సస్పెన్షన్ చేయాలి. కానీ, ఇక్కడ ఈ నిబంధనలకు ప్రభుత్వం మంగళం పలికింది. హుటాహుటినా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చర్యపై అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతుండగా.. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఏఈవోలు మూకుమ్మడి సెలవుల్లో వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. అదే జరిగితే ప్రస్తుత ధాన్యం కొనుగోళ్ల పై భారీ ప్రభావం పడే ప్రమాదమున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏఈవోల విషయంపై ఆలోచన చేయాలన్న డిమాండ్‌ను ఉద్యోగ సంఘాలు వినిపిస్తున్నాయి.
సస్పెన్షన్లు వీరికే..
ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 18మంది ఏఈవోలపై వేటు వేయగా, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో మాత్రం పేర్లను ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో మేడిపల్లి మండలం వెంకట్రావుపేట్ క్లస్టర్ ఏఈవో ఐలవేని నరేందర్, కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ జీ గ్రీష్మ, మెట్పల్లి మండలం బండలింగాపూర్ బీ మనోజ్ఞ, కోరుట్ల పీ నరేశ్, ధర్మపురి మండలం తిమ్మాపూర్ ఎన్ సమంతను సస్పెండ్ చేశారు. అలాగే సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్ ఏఈవో మహ్మద్ ఇనామిల్, శాత్రాజులపల్లె దుండ్రపల్లి రాజు, ఇల్లంతకుంట ఏఈవోలు ఆవునూరి గంగ, దాచారం వంగల అర్చన, ముస్తాబాద్ ఎదునూరి కీర్తనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.