కలెక్టరేట్, నవంబర్ 12: సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక సర్వేలో భాగంగా జిల్లాలో నిర్వహించిన హౌస్ హోల్డ్ కార్యక్రమంలో స్టిక్కరింగ్ చేయని ఇళ్లు కూడా సర్వే చేయనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా వివిధ మండలాల్లో పర్యటిస్తున్న కలెక్టర్, ఇతర అధికారుల వద్ద ప్రజలు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమాధానాలు చెప్పారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, భవిష్యత్‌లో ప్రభుత్వం పలు ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకే సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంటి యజమానికి ఇష్టమైతేనే సర్వేలో ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు ఆధారాలు చూపాలన్నారు. ఎలాంటి బలవంతం లేదని విస్పష్టంగా తెలిపారు. 2011లో నిర్వహించిన సర్వే ఆధారంగానే తాజాగా ఇళ్ల గుర్తింపు కోసం స్టిక్కరింగ్ చేసినట్లు చెప్పారు. దీని ప్రకారం జిల్లాలో 1958 ఎన్యుమరేషన్ బ్లాకులు ఉండగా, కొత్తగా 730 ఈబీలు పెరిగాయన్నారు. గతంలో 150 ఇళ్లకు ఒక ఈబీని నిర్ధారించగా, ప్రసుతం 175 ఇళ్లకొక ఈబీగా జాబితా రూపొందించామన్నారు. ఈ ఇళ్లలో అదనంగా కుటుంబాలు ఉంటే బైనంబర్లతో సర్వే చేస్తున్నట్లు తెలిపారు. 3.30 లక్షల ఇళ్లు జిల్లాలో సర్వే చేయబోతుండగా, సోమవారం నాటికి 60,400 ఇండ్లు, 18 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు.
జిల్లాలో ప్రజలు సర్వేకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, నిర్దేశించిన గడువులోగా వందశాతం సర్వే పూర్తి చేయనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఈబీకి ఒక ఎన్యుమరేటర్ చొప్పున జిల్లావ్యాప్తంగా 2,700 మంది ఎన్యుమరేటర్లను సర్వే కోసం వినియోగిస్తున్నామన్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 20 ఇళ్ల చొప్పున పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లకు ఎలాంటి ఒరిజనల్, జిరాక్స్ ప్రతులు కూడా అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కుటుంబ యజమానులు అందుబాటులో లేకున్నా, డోర్‌లాక్ ఉన్నా ఎన్యుమరేటర్ మరోసారి వచ్చి వివరాలు సేకరిస్తారని వివరించారు. ఒకే ఇంటిలో ఎంతమంది వేర్వేరుగా నివాసమున్నా, వారికి వేర్వేరుగా ఫారాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. సర్వేపై సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, శిక్షణ కలెక్టర్ అజయ్‌యాదవ్, ముఖ్యప్రణాళిక అధికారి కొమురయ్య, తదితరులు ఉన్నారు.