కమాన్ పూర్, ఫిబ్రవరి 5: మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో గల రెండు వాగులపై నాలుగు చెక్ డ్యాముల నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే నిర్వహించారు. కాగా, ఇటీవల సింగరేణి ఆర్ జీ -2 జీఎం బండి వెంకటయ్యకు సింగరేణి ప్రభావిత గ్రామమైన పెంచికల్ పేట్ వాగుల పై చెక్ డ్యాములు నిర్మించి రైతులకు సాగునీటి ఇక్కట్లు దూరం చేయాలని పల్లె నారాయణ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించి చెక్ డ్యాముల నిర్మాణాలపై సర్వే నిర్వహించి నివేదిక అందజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలోనే ఇరిగేషన్ అధికారులు పెంచికల్ పేట్లో గల యాపల వాగుపై రెండు చోట్ల, మద్దుల వాగుపై మరో రెండు చోట్ల చెక్ డ్యాముల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాలను గుర్తించారు. అలాగే వీటి నిర్మాణాలకు సంబంధించిన అంచనా వ్యయాలను రూపొందించే సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు నివేదికను సింగరేణి అధికారులకు సమర్పించనున్నారు. ఆ తదుపరి నిధులు మంజూరు కోసం సింగరేణి ఆర్. జీ -2 యాజమాన్యం సింగరేణి సంస్థ యాజమాన్యానికి నీవేదిక సమర్పించనుంది.
సింగరేణి సంస్థ ప్రభావిత గ్రామంతో పాటు పునరావాస కాలానీల ఏర్పాటుయైన గ్రామంగా గుర్తింపు కలిగి ఉంది. ఈ పరిణామల నేపథ్యంలో నూటికి నూరు శాతం సింగరేణి సంస్థ పెంచికల్ పేట్ గ్రామంలో గల వాగులపై చెక్ డ్యాముల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసే అవకాశాలు కలవు. సింగరేణి ప్రభావిత గ్రామ రైతులకు సాగు నీటి కష్టాలు తొలిగించే విధంగా కృషి చేస్తున్న సింగరేణి యాజమాన్యానికి ఆ గ్రామ రైతుల పక్షాన వాగులపై చెక్ ద్యాముల నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేసిన పల్లె నారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సర్వే కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ జక్కా ప్రవీణ్ కుమార్, వర్క్ ఇన్ స్పెక్టర్ చిప్ప సదానందం, లష్కర్లు నారాయణ, రాజేందర్, రైతులు పల్లె నారాయణ, సిరివెన రాజు, డబ్బేట లింగయ్య, కొలిపాక పోచాలు, నూనే నర్సింగంలతో పాటు తదితరులు పాల్గొన్నారు.