MLA CH Vijaya Ramana Rao | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 4 : సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తికి మద్దతు ధర లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లిలో గల మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో గురువారం సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిన్నింగ్ మిల్ యాజమాన్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతు కలవేన మల్లేశంకు చెందిన 27.80 క్వింటాళ్ల పత్తిని మొదట కోనుగోలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన ఏ-గ్రేడ్ పత్తికి క్వింటాలుకు రూ.8100 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలిపారు. 8 నుండి 12 శాతం లోపు తేమ ఉండేలా పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులను కోరారు. పత్తి పంట స్థానంలో మొక్కజొన్న సాగుతో అధిక లాభాలుంటాయని రైతులు పంట మార్పిడీ పద్ధతులు పాటించాలన్నారు. అలాగే ఈ మధ్య రైతులు పొలాల్లో వరికొయ్యలను కాల్చుతున్నారని, అలా కాల్చితే భూసారం తగ్గుతుందని అన్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటల దిగుబడి తగ్గిందన్నారు. రైతులు పంటల మార్పిడీపై దృష్టి సారించాలని సూచించారు.
మొక్కజొన్న సాగుతో అధిక లాభాలు పొందవచ్చన్నారు. హైబ్రిడ్ సీడ్ మొక్క జొన్న సాగుతో ఎక్కువ దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని, ఆదిశగా రైతులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల పంటల సాగుకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిన్నింగ్ మిల్ యజమానులు నర్సింగరావు, మంగారావు, సీసీఐ అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.