గోదావరిఖనికి చెందిన కళాకారిణి నృత్యానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఫిదా
GODHAVARIKHANI | కోల్ సిటీ , మార్చి 30: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వలకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చే ప్రత్యేక ప్రశంస లభించింది.
భళా… గుమ్మడి ఉజ్వల అంటూ స్వయాన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గోదావరిఖని నృత్యఖని పేరు ప్రస్తావించడం విశేషం. ఈ మేరకు హైదరాబాద్ రాజ్ భవన్ లో దక్షిణ కేంద్ర జాతీయ భారత భాషా సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ కార్య నిర్వహణలో జరిగిన ఉగాది కళోత్సవాలలో గోదావరిఖనికి చెందిన గుమ్మడి ఉజ్వలకు స్వాగత ప్రదర్శన అవకాశం దక్కించుకుంది.
నాట్య కళా ప్రదర్శనలో ఉజ్వల తొలి గణపతి వందనం, తాండవ నృత్యఖరీ గజాననా కూచిపూడి నాట్య సంప్రదాయ పద్ధతిని అలంకరిస్తూ చేసిన ప్రదర్శనకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతోపాటు ఐఏఎస్ దాన కిశోర్, తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి ఫిదా అయ్యారు.
గోదావరిఖనిలో నృత్యఖని స్థాపించి ఎంతోమందికి కూచిపూడి తర్పీదు ఇవ్వడమే గాకుండా ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు కూచిపూడి నృత్యం విలువలపై అవగాహన కల్పించి ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇవ్వడానికి గొప్ప కార్యక్రమంకు శ్రీకారం చుట్టారని తెలుసుకొని ఆమెను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఉజ్వలను గవర్నర్ శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.