ధర్మపురి, డిసెంబర్21 : సుపారీ తీసుకొని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు వచ్చిన ఉత్తర ప్రదేశ్ రాష్ర్టానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఐ ఉదయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన మెరుగు లక్ష్మణ్, కమలాపూర్‌కు చెందిన నేరెళ్ల గోపాల్ ముంబైలో కల్లుడిపో నిర్వహిస్తున్నారు. ఓ రోజు లక్ష్మణ్.. గోపాల్‌తో మాట్లాడుతూ తన మరదలిని తన గ్రామానికి చెందిన తోకల గంగాధర్ కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నాడని, పలుసార్లు మందలించినప్పటికీ అతడిలో మార్పు రాలేదని, అందుకే గంగాధర్‌ను చంపాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. ఎవరైనా ఉంటే సుపారీ మాట్లాడుదామని చెప్పాడు. దీనికి గోపాల్ స్పందించి తన స్నేహితుడైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ సూర్య ప్రకాశ్‌సింగ్(27) అనే షూటర్‌కు చెబుదామని నిర్ణయించుకొని అదే రోజు ఫోన్ చేశారు.
విషయం వివరించి, ఎలాగైనా గంగాధర్‌ను చంపాలని చెప్పారు. అందుకోసం 4 లక్షల సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. గంగాధర్‌ను హత్య చేయాల్సిన తేదీ, ప్రదేశం అన్నీ సెట్ చేసుకున్నారు. తీరా సమయానికి హత్య చేయాల్సిన అవసరం లేదంటూ గోపాల్, లక్ష్మణ్ చెప్పడంతో సూర్యప్రకాశ్‌సింగ్ తీవ్ర ఆవేశానికి లోనై గోపాల్‌ను బెదిరించసాగాడు. హత్య చేసినా చేయకున్నా ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేదంటే మీ తండ్రి రమేశ్‌ను చంపుతానని గోపాల్‌ను బెదిరించాడు. దీంతో భయపడ్డ అతడు షూటర్‌ను నమ్మించి అకౌంట్ సెటిల్ చేస్తానని ఈనెల 12న ముంబై నుంచి నేరెళ్లకు తీసుకువచ్చాడు.
ఈ నెల 13న రాత్రి 11.30 గంటల సమయంలో పథకం ప్రకారం సూర్యప్రకాశ్‌ను నేరెళ్లకు చెందిన గండికోట శేఖర్ సహకారంతో నేరెళ్ల అటవీప్రాంతంలో ఉన్న సాంబశివుని గుడి వద్దకు కారులో తీసుకువచ్చారు. గుడి సమీపంలో గోపాల్, శేఖర్, సూర్య ప్రకాశ్ మద్యం తాగారు. శేఖర్ సూర్యప్రకాశ్‌ను మాటల్లో పెట్టగా, గోపాల్ ఒక పెద్ద బండరాయి తెచ్చి సూర్యప్రకాశ్ తలపై మూడుసార్లు బలంగా మోది హత్య చేశాడు. ఎవరైనా వచ్చి గుర్తుపడతారేమోననే భయంతో మృతదేహాన్ని కారులో వేసుకొని నేరెళ్ల-బట్టపల్లి అటవీప్రాంతంలోకి తీసుకెళ్లారు. కట్టెలు వేసి, పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేశారు. అయితే, పూర్తిగా దహనమైందో లేదోననే అనుమానంతో మరుసటి రోజు 14న ఉదయం వెళ్లి చూశారు.
కొంత భాగం కాలకపోవడంతో మళ్లీ కట్టెలు పోగు చేసి పెట్రోల్‌పోసి అంటించారు. అయితే, గ్రామానికి కొత్తగా కార్లు రావడం, రెండు రోజుల కిత్రం వీరితో తిరగిన వ్యక్తి కనిపించకపోవడంతో గ్రామంలో కలకలం మొదలైంది. ఈ విషయం పోలీసులకు చేరడంతో విచారణ మమ్మురం చేశారు. దీంతో భయాందోళనకు గురైన గోపాల్, శేఖర్ శనివారం ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు వచ్చి సూర్యప్రకాశ్‌ను తాము హత్య చేసినట్లు లొంగిపోయారు. హత్య జరిగిన ఘటనా స్థలానికి జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, ధర్మపురి సీఐ రాంనర్సింహరెడ్డి, ధర్మపురి, బుగ్గారం ఎస్ఐలు ఉదయ్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి వెళ్లి పరిశీలించారు. అనంతరం నేరెళ్ల-బట్టపెల్లి అటవీ ప్రాంతంలో దహనం చేసిన ప్రదేశానికి వెళ్లారు. బూడిద తప్ప ఎలాంటి ఆనవాళ్లు కనిపించడకుండా బుగ్గి చేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వివరించారు.