బోయినపల్లి రూరల్ జూలై 4 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, అర్హుల పేర్లు మిస్ కాకుండా చూడాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హకు అత్యంత విలువైనదని, అర్హత ఉన్న ప్రతి ఒకరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా పార్టీ శ్రేణులు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
శనివారం బోయినపల్లి మండల బీఆర్ఎస్ కార్యాలయంలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), ముఖ్య కార్యకర్తలతో సమావేశమై అవగాహన కల్పించారు. అంతకు ముందు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, గ్రామాల్లో బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు.
జాబితాలో పేరు లేకపోతే కేవలం ఓటు హక్కు పోవడమే కాకుండా పలు ప్రభుత్వ సేవలు, గుర్తింపు పత్రాల పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల పేర్లు తొలగించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒకరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో బీఎల్వోలు సవరణ ఫారాలను కేవలం కరపత్రాల మాదిరిగా పంపిణీ చేస్తున్నారని, సరైన అవగాహన కల్పించడం లేదని విమర్శించారు.
‘సర్’ గడువును పొడిగించి, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేసి పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొంకటి నాగయ్య, మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, సర్పంచులు అనుముల భాసర్, కట్ట గోవర్ధన్, నాయకులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, కొంకటి శేఖర్, జంపుక ఆనంద్, అకనపల్లి కరుణాకర్, రాములు, చిందం రమేశ్, తదితరులు పాల్గొన్నారు