బోయినపల్లి రూరల్, జూలై 22 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు, స్థానిక నాయకత్వానికి పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామగ్రామానా గులాబీ జెండా ఎగరాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. బీఆర్ఎస్ బోయినపల్లి మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య అధ్యక్షతన మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎకడా లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఏ ఒక పనిని కూడా కాంగ్రెస్ సర్కారు కొనసాగించక పోగా, ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలను ఇంకా ప్రారంభించలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు నాట్లప్పుడు పడేదని, కానీ ఇప్పుడు ఓట్లప్పుడు మాత్రమే పడుతున్నదని, వానకాలం పంటకు రైతుబంధు ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎకరానికి 15 వేల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలను తీసుకొని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బోయినపల్లి మండలంలో మెజారిటీ సీట్లు గెలిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు చెన్నాడి అమిత్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు తీపిరెడ్డి కిషన్రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, మాజీ వైస్ ఎంపీపీ కొంకటి నాగయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ రాములు, మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ అజ్జూ, తదితరులు పాల్గొన్నారు.