చొప్పదండి, మార్చి17: కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో పోలీసులు కాంగ్రెస్ కు చుట్టంగా వ్యవహరిస్తూ ఇష్టరాజ్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. అసెంబ్లీలో సస్పెన్షన్ గురైన జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని, కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించినందుకు పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసే సందర్భంలో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరగడంతో బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. విషయం తెలుసుకున్న రవిశంకర్ పోలీస్ స్టేషన్ వచ్చి బీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని, ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉందా బీఆర్ఎస్ ఉందా అర్థం అవుతలేదని ఎద్దేవా చేశారు.
చట్టం కాంగ్రెస్ కు చుట్టమైందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేస్తే పోలీస్ స్టేషన్ కు తీసుకు రావడం ఇదెక్కడి రాజ్యం, ఇదెక్కడి చట్టం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు పోలీసుల రాజ్యం కనబడుతుందని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టిన ప్రజలు, రైతుల సమస్యల పట్ల ఆరు గ్యారంటీలు, 400 హామీలు నెరవేరే చేదాకా కొట్లాడుతూనే ఉంటామని హెచ్చరించారు. ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేక కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.