కార్పొరేషన్, నవంబర్ 10 : ఎంపీగా గెలిచి నాలుగేళ్లు అవుతున్నా ఏ రోజు కూడా బండి సంజయ్ అభివృద్ధి విషయంలో కనీస ఆలోచన చేయలేదని నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు విమర్శించారు. నగరాభివృద్ధిపై లెక్కలు, ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, సమయం వేదిక చెప్తే వస్తామని సవాల్ చేశారు. శుక్రవారం స్థానిక ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంజయ్ నోటి నుంచి అభివృద్ధి అనే మాట వినడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై అవగాహన లేని వ్యక్తి సంజయ్ అని మండిపడ్డారు. నగరాభివృద్ధి విషయంలో ఎంపీగా కేంద్రం నిధులతో చేసినవి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నగర ప్రజలకు ఏం సేవ చేశారో చెప్పాలన్నారు.
ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.90 లక్షలు తప్ప నగరాభివృద్ధి కోసం స్వతహాగా తెచ్చిన నిధులు ఏంటో చెప్పాలన్నారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ నగరాభివృద్ధి కోసం తెచ్చిన నిధులు, ఎంపీగా నీవు తెచ్చిన నిధులపై చర్చిద్దామన్నారు. నగరాభివృద్ధి కోసం వినోద్‌కుమార్, గంగుల కమలాకర్ రూ.500 కోట్ల నిధులు తీసుకువచ్చి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. నగర పరిధిలో ఎలక్ట్రికల్ పోల్స్ తొలగించి టవర్స్ వేసేందుకు రూ.130 కోట్లు, రూ.50 కోట్లతో ఐటీ టవర్, రూ.230 కోట్లతో కేబుల్ బ్రిడ్జి రూ.800 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్, రూ.100 కోట్లతో పట్టణ ప్రగతి, రూ.150 కోట్ల జనరల్ ఫండ్ నిధులతో పనులు చేపట్టింది కనిపించడం లేదా? అని నిలదీశారు. కొత్తగా రూ.130 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరవడమే కాకుండా, పనులు జరుగుతున్నాయన్నారు.
ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులేనని, వీటిల్లో ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు లేవన్నారు. చేయని అభివృద్ధి పనులను చెప్పుకోవడం సంజయ్‌కి అలవాటుగా మారిందని విమర్శించారు. నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఏ రోజు కూడా బండి చేయలేదని విమర్శించారు. ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం తప్ప ప్రజా సమస్యలు, అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా కూడా సీఎం కేసీఆర్, వినోద్‌కుమార్, గంగుల కమలాకర్ కృషి వల్లే వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు వద్దని కరీంనగర్‌ను ప్రతిపాదిస్తే ఆ హోదా వచ్చిందన్నారు. స్మార్ట్‌సిటీకి వచ్చిన రూ.600 కోట్ల నిధుల్లో కేంద్రం రూ.300 కోట్లు ఇస్తే, రాష్ట్రం రూ.300 కోట్లు ఇచ్చిందన్నారు. బండి సంజయ్ నగరానికి తెచ్చిన కొత్త ప్రాజెక్టు ఏం ఉందని ప్రశ్నించారు.
స్మార్ట్‌సిటీ హోదా వచ్చినప్పుడు ఆయన ఎంపీ కాదని, కేవలం కార్పొరేటర్ అని గుర్తు పెట్టుకోవాలని హితవుపలికారు. దీని కోసం కార్పొరేటర్లంతా ఢిల్లీకి వెళ్లే అక్కడికి కూడా రాలేని దౌర్భాగ్యుడని విమర్శించారు. తీగలగుట్టపల్లి ఓవర్ బ్రిడ్జి వినోద్‌కుమార్ ఉన్న సమయంలోనే వచ్చిందని, అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రోడ్స్ టాక్స్ వాటాను బ్రిడ్జి నిర్మాణానికి మళ్లించారే తప్ప బీజేపీ తెచ్చిన నిధులు కావన్నారు. నాలుగున్నరేళ్లు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇప్పుడు వచ్చి ఏదిపడితే అది మాట్లాడితే చెల్లదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.2 వేల పింఛన్‌లోనూ రెండు పైసలు కూడా కేంద్రం వాటా లేదన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా నగరపాలక సంస్థకు నిధులు ఈ స్థాయిలో రాలేవన్నారు. నాలుగున్నరేళ్లు ఏం అభివృద్ధి చేయలేకపోయానని బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలే తప్ప ప్రజల్ని మభ్యపెట్టి తప్పుడు ప్రచారాలతో ఓట్లు అడగవద్దని హితవుపలికారు. మళ్లీ ఒకసారి బీఆర్ఎస్కు అవకాశం ఇస్తే చేపట్టిన అన్ని పనులూ పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు బండారి వేణు, శ్రీకాంత్, గంట కల్యాణి, గందె మాధవి, నాయకులు అర్ష మల్లేశం, రమణారావు, వేణు, శ్రీనివాస్‌గౌడ్, అనిల్ పాల్గొన్నారు.