కరీంనగర్ : లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆదిశగా కృషి చేసినట్లయితే అనుకున్న గమ్యాన్ని సునాయాసంగా చేరుకోగలరని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని జాన్ విల్సన్ మెమోరియల్ హాల్లో వారధి సొసైటీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ తరగతుల కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే నిరుద్యోగ యువకులు సరైన మెటీరియల్ అందుబాటులో లేదు అనే చిన్న చిన్న కారణాలతొ పరీక్షలో ఉతీర్ణతను సాధించలేకపోయామని అనుకోవద్దన్నారు. మీ చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని మెటీరియల్ గా మలుచుకొని ఇంట్లో ఉండికూడా చదువుకోవచ్చని పేర్కొన్నారు. లక్ష్యం కోసం మీరు ఎంత కృషిచేస్తారో అంతే విజయాన్ని సాధించగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతిఒక్కరు మీ అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆదిశగా కష్టపడ్డప్పుడే మీరు కలలు కనే మార్గానికి చేరుకుంటారని అన్నారు. ఉచిత శిక్షణను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకొవాలని పిలుపునిచ్చారు.
పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే వారికోసం అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిసిపి శ్రీనివాస్, ఎర్ఎసిపి ప్రతాప్, వారధి సొసైటీ ప్రతినిధులు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.