
KTR | గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరిఖని చౌరస్తాకు చెందిన మేకల రవి సుమన్ తండ్రి మేకల(రేడియం) శ్రీనివాస్ కుమారుడు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఇన్ మాస్ మీడియా కమ్యూనికేషన్ లో విద్యనభ్యసిస్తున్నారు.
విద్యలో భాగమైన ల్యాప్ టాప్ అవసరం ఉండగా తన చదువులో ల్యాప్ టాప్ లేక ఇబ్బందులు పడుతున్నారని, విషయం తెలుసుకున్న రామగుండము నియోజకవర్గం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వ్యాల్ల హరీష్ రెడ్డి సోమవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో రవి సుమన్ కు కేటీఆర్ చేతులమీదుగా ల్యాప్ టాప్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో పేదల పక్షపాతిగా, నిరుపేదలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు వివిధ వర్గాలకు చెందిన ఆపదలో ఉన్నవారికి అండగా వివిధ రకాలుగా హరీష్ రెడ్డి చేస్తున్న సేవలను అభినందించారు. రాబోయే రోజుల్లో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక మంచి యువతకు ఉపాధి కల్పించేలా ఐటి టవర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.
అలాగే రవి సుమన్ మంచిగా చదువుకొని.. ఈ ప్రాంతానికి ఆదర్శంగా నిలువాలని.. ఇలాంటి పేదవారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో అవసరమైన సహాయ సహకారాలు అందించాలని హరీష్ రెడ్డికి సూచించారు. రవి సుమన్ కుటుంబ సభ్యులు హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కోఆప్షన్ మెంబర్ తస్నిం బాను, బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, యువజన విభాగం అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.