గంగాధర, మార్చి 30 : ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐటి, నీట్ ప్రతిభా పరీక్షలో గంగాధర మండలం మధురానగర్ లోని సురభి పాఠశాల విద్యార్థి జి.నిహాల్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే పాఠశాల విద్యార్థులు హర్షిని, కృష్ణప్రియ, స్నేహ పాఠశాల టాపర్లుగా నిలిచారు. కాగా శనివారం హైదరాబాద్లోని తెలంగాణ కాంట్రాక్టు క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో రామకృష్ణ మఠం అధ్యక్షుడు మహారాజ్ బోధ మయానంద స్వామి, టెక్ మహీంద్రా బిపిఓ విజయ్ రంగినేని, ప్రగతి సీఈఓ జగదీష్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, మెమంటోలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ పరీక్షలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుకు సహకారం అందజేయాలని సూచించారు. ప్రతిభ పరీక్షలు నిర్వహించిన ఏకలవ్య ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కాగా రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం, డైరెక్టర్ చిప్ప వీరనర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.