summer training camps | కోరుట్ల, మే 1: విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి గంగుల నరేశం పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపు శిక్షణ శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆయన ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల, బాలుర ఉన్నత పాఠశాల, గడి ప్రాధమిక పాఠశాలల్లో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
15 రోజుల పాటూ కొనసాగే వేసవి శిక్షణ శిబిరంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు చదువుతో పాటూ డ్రాయింగ్, క్రాఫ్ట్, కరాటే, కుట్లు, డ్యాన్స్, వివిధ రకాల ఆటల పోటీలు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. క్యాంపుకు హజరయ్యే విద్యార్థులకు ఆల్పహరం, పెన్నులు, నోట్ బుక్కులు, అందిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలో నివాసం ఉంటున్న విద్యార్థులు శిక్షణకు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి మార్గం రాజేంద్రప్రసాద్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, నల్ల భూమయ్య, సీఆర్పీలు దేవేందర్, గంగాధర్, సత్యనారాయణ, మన్విత, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.