Collector B Satyaprasad | జగిత్యాల, సెప్టెంబర్ 20 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన క్రీడోత్సవాలను కలెక్టర్ బీ సత్యప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన విధానంలో ప్రతీ ఒక్కరూ క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు.
క్రీడల ద్వారా పని ఒత్తిడిని తగ్గించుకుని మానసికంగా దృడంగా ఉండాలన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓడినవారు అనుభవంగా మలుచుకొని విజయం సాధించే దిశగా పట్టుదలతో కృషిచేయాలని అన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటిల్లో పాల్గొనాలని కోరారు. క్రీడల పోటీలలో క్రికెట్ 8 జట్లు, వాలీబాల్ బాలురు 9 జట్లు, బాలికలు 3 జట్లు, పాల్గొనగా బ్యాడ్మింటన్ లో 32 మంది పాల్గొన్నారు.
దీంతో పాటు మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్ క్రీడలు నిర్వహించినట్లు జిల్లా యువజన క్రీడల అధికారి డాక్టర్ కోరుకంటి రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, డీఆర్డీవో రఘువరన్, జిల్లా అధ్యక్షుడు పడాల విశ్వాసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.