Quality meals | మెట్ పల్లి రూరల్, జూలై 7: ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను ప్రిన్సిపాల్ మాధవి లతను అడిగి తెలుసుకున్నారు.
గురుకులంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. గురుకులం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.