Balanced Food | చిగురుమామిడి, జూన్ 11: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సమతులమైన ఆహారాన్ని అందించాలని మండల విద్యాధికారి వి. పావని అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, కస్తూరిభా గాంధీ పాఠశాలలో శానిటేషన్ వర్కర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనాన్ని ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులకు తగు సూచనలు ఇవ్వాలన్నారు.
విద్యార్థులలో శారీరక, మానసిక వికాసానికి సమతుల ఆహారం అత్యవసరమని, దీంతోపాటు విద్యార్థులలో ఏకాగ్రత పెంపొందించడానికి పరిశుభ్రమైన పోషకాహారం తోడ్పడుతుందని పేర్కొన్నారు. పాఠశాల పరిశుభ్రతలో సానిటేషన్ వర్కర్లు చేయవలసినటువంటి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రబియా బస్రి, జిల్లా రిసోర్స్ పర్సన్ లక్ష్మణ్ రావు, మండల రిసోర్స్ పర్సన్ చంద్రశేఖర్, ఎంఆర్సి పర్యవేక్షకులు బొడ్డు తిరుపతి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాల్గొన్నారు.