Vemulawada | వేములవాడ రూరల్, ఆగస్టు 21 : జీవో 97ను ఎత్తేయాలని అగ్రహారంలో విద్యార్థుల ఆందోళన శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల గేట్లను తెరుచుకుని సామూహికంగా బయటకు వచ్చారు. ఆ తర్వాత విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం విద్యార్థులు రోడ్డుపైనే యోగాసనాలు వేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. విద్యార్థులంతా కలిసి జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించి తమ నిరసనను కొనసాగించారు. దాదాపు గంటన్నరపాటు రోడ్డుపైనే విద్యార్థుల ఆందోళన కొనసాగింది. దీంతో కళాశాల పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించేంత వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.