బీబీనగర్, అక్టోబరు 01 : భూ భారతి పోర్టల్ సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారులు, విక్రయదారులు నిన్న ఉదయం నుండి (బుధవారం) రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ సర్వర్ పనిచేయక పోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారు సైతం రిజిస్ట్రేషన్ పూర్తవుతుందన్న ఆశతో గంటల తరబడి కార్యాలయాల వద్దే నిరీక్షిస్తున్నారు. సర్వర్ అందుబాటులో లేని సమయంలో స్లాట్ లు బుక్ చేసుకోవద్దని, ముందుగానే పరిస్థితిని స్పష్టం చేయాలని సంబంధిత అధికారులను కొనుగోలుదారులు, విక్రయదారులు వేడుకుంటున్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కాకపోవడంతో సమయం, డబ్బు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి పెండింగ్ రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని కోరుతున్నారు.