– బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు పీజీ, డిప్లొమా కోర్సులకు అవకాశం
– కొత్తగా ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఎస్డబ్ల్యూ, ఎమ్మెస్సీ డేటా సైన్స్ తదితర కోర్సులు
– జాయింట్ డైరెక్టర్ డా.బి ధర్మ నాయక్ వెల్లడి
రామగిరి, అక్టోబర్ 01 : డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న వివిధ కోర్సుల ప్రవేశాల గడువును ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించినట్లు, వర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్, యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం (LSSB) డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం వారు వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ, డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీలో పలు కొత్త పీజీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంఏ (ఎడ్యుకేషన్), ఎంఏ ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), ఎంఎస్డబ్ల్యూ (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్), ఎమ్మెస్సీ జాగ్రఫీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ ఆన్లైన్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. బీకాం తెలుగు మీడియం, బీకాం ఇంగ్లీష్ మీడియం, ఎంఏ తెలుగు, ఎంకామ్, ఎంబీఏ కోర్సులకు ఆన్లైన్లో అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అర్హత ఉన్న విద్యార్థులు www.braouonline.in వెబ్సైట్లోని Admission Registration ద్వారా లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసిన అనంతరం విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న స్టడీ సెంటర్ను సంప్రదించాలని సూచించారు.