బడుగు, బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకులాలపై పర్యవేక్షణ కరువవుతున్నది. ఏడాది క్రితం వరకు సాఫీగా నడిచినా ఆ పాఠశాలల్లో.. ఇప్పుడు అంతా అస్తవ్యస్తంగా మారుతున్నది. పదకొండు నెలల పాలనలో గాడితప్పినట్టు తెలుస్తుండగా, తరచూ ఏదో ఒక ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నది. విద్యార్థుల మరణాలు, అస్వస్థత లాంటి ఘటనలు జరిగినప్పుడే హడావుడి చేస్తున్నా ఆ తర్వాత షరామామూలే అవుతున్నది. మూడు నెలల క్రితం పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు పిల్లలు చనిపోయినప్పుడు డిప్యూటీ సీఎం పరిశీలించి, గురుకులాల ప్రక్షాళనకు ఆదేశాలిచ్చినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాఠశాలలను సందర్శించి, బసచేయాలని ఉత్తర్వులు ఇచ్చినా అవీ అమలు కాలేదు. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారు కాగా, సమస్యలు పరిష్కారం కాక విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. చాలాచోట్ల ప్రమాదపుటంచున పిల్లల చదువులు సాగిస్తున్నట్టు తెలుస్తుండగా, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు జగిత్యాల జిల్లాలోనే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యంత ఘనమైన చరిత్ర కలిగి ఉంది. 1983లో దీనిని ఏర్పాటు చేయగా, కాలగమనంలో జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ అయింది. ప్రస్తుతం పెద్దాపూర్ గురుకులంలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యాబోధన కొనసాగుతుండగా, 40 ఏండ్ల కాలంలో వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దింది. ఎంతో మంది దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. అలాంటి గురుకులంలో ఈ యేడాది జూలై, ఆగస్టు నెలల్లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, మరో నలుగురు చావు అంచులదాకా వెళ్లడం కలకలం రేపింది. ఇద్దరు విద్యార్థుల మృతికి కారణాలు ఏంటో ఇంత వరకు ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించ లేకపోయింది. కానీ, పర్యవేక్షణాలోపం, వసతుల లేమే అందుకు కారణమని తెలుస్తుండగా, అప్పుడు పాఠశాలకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేయబోతున్నామని ప్రకటించారు. అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. అయితే, ఆయన ఆదేశాలు జారీ చేసి రెండు నెలలు గడిచినా, ఇంత వరకు అవి కార్యారూపం దాల్చక పోవడం, ప్రజాప్రతినిధులు, అధికారులు వాటిని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
గురుకులాల నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇచ్చినా కార్యరూపం దాల్చడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేక అంతా అస్తవ్యస్తంగా మారుతున్నది. వసతుల లేమి, అపరిశుభ్ర వాతావరణంలో కొట్టుమిట్టాడుతుండగా, ఈ పరిస్థితుల్లోనే ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అందుకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల పాఠశాలల ఆవరణలో పిచ్చి చెట్లు మొలవడం, సమీపంలో చెత్తాచెదారం ఉండడం లాంటి కారణాలతో పాములు తిరుగుతున్నాయి. పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరి మృతికి కారణాలు ఇప్పటి వరకు తెలియకున్నా.. సుల్తానాబాద్‌లో మాత్రం పాముకాటుతోనే విద్యార్థి దవాఖాన పాలయ్యాడు. చాలాచోట్ల పాఠశాలల ఆవరణల్లోకి పాములు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. అయినా, పట్టించుకునే వారు లేరు. పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు చనిపోయిన తర్వాత గానీ, ప్రజాప్రతినిధులు, అధికారులు కదలలేదు. పాత భవనాలను నేలమట్టం చేసి, కొత్త భవనంలోకి పిల్లలను పంపించారు. అప్పుడు ఆవరణ అంతా ఎక్స్కవేటర్లతో చదును చేశారు. ఆ సమయంలో పాములు బయటికి రావడంతో చంపేశారు. ఇలాంటి పరిస్థితే చాలాచోట్ల ఉన్నది.
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లోని బీసీ సంక్షేమ గురుకుల స్కూల్ విద్యార్థినులు ఈ నెల 16న రోడ్డెక్కారు. ప్రిన్సిపాల్ తమను వేధిస్తున్నదని, సెలవులకు ఇంటికి వెళ్లి ఆలస్యంగా వస్తే డబ్బులు వసూలు చేస్తున్నదని ఆరోపించారు. తమను చూడడానికి వచ్చిన తల్లిదండ్రులపైనా దురుసుగా ప్రవరిస్తున్నదని మండిపడ్డారు. వెంటనే ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన అధికారులు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. నిజానికి విద్యార్థులు చాలా రోజులపాటు ఇబ్బందులు పడ్డారు. విసిగి వేసారి రోడ్డెక్కితేగాని సమస్య పరిష్కారం కాలేదు.
పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన నేపథ్యంలో ఆగస్టు 13న మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. దాదాపు ఐదు గంటల పాటు పాఠశాలలో కలియతిరిగారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. కానీ, అందులో పెద్దాపూర్ విద్యార్థులకు బెడ్స్ తప్ప మరే హామీ నెరవేరలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యార్థులకు బెడ్స్, బెడ్‌షీట్స్‌ను అందిస్తామని చెప్పారే తప్ప ఇంత వరకు ఇవ్వలేదు. ఇక ప్రహరీల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. విద్యార్థులకు హెల్త్‌కార్డులు జారీ కాలేదు.
ప్రతి నెలా రెండుసార్లు వైద్య శిబిరాలు నిర్వహించడం లేదు. హెల్త్‌కార్డులో విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నమోదు ప్రక్రియపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇక ప్రధానంగా మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురుకుల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో భోజనం చేసి, సమీక్ష సమావేశం నిర్వహించి, బస చేసిన దాఖలాలు లేవు. అన్నింటికంటే అధ్వానమైన విషయం ప్రభుత్వం కలెక్టర్లు, డీఎంహెచ్వోలు విధిగా నెలకో గురుకులాన్ని సందర్శించి, బస చేయాలని ఇచ్చిన ఉత్తర్వులు సైతం అమలు కావడం లేదు. రెండు నెలల కాలంలో ఏ ఒక్క రోజు, ఏ ఒక్క గురుకులంలో బస చేసిన దాఖలాలు లేవు. ఇలా ఆనాడు డిప్యూటీ సీఎం ఎన్నో హామీలు ఇచ్చినా అమలుకు మాత్రం నోచడం లేదు.
గురుకుల పాఠశాలల వ్యవహారంలో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నా ఆచరణలో మాత్రం అవన్నీ తేలిపోతున్నాయని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. గురుకులాల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు. ప్రమాదపుటంచున పిల్లల చదువులు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది కూడా స్థానికంగా ఉండడం లేదని, ఏదైనా జరిగినప్పుడు పిల్లలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటున్నదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకులంలో నెల వ్యవధిలోనే ఇద్దరి ప్రాణాలు పోయాయి. జూలై 26న ఎనిమిదో తరగతి విద్యార్థి రాజారపు గణాధిత్య(13) మృతి చెందగా, అస్వస్థతకు గురైన మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స తర్వాత కోలుకున్నారు. ఆగస్టు 9న 6వ తరగతి విద్యార్థి ఎడ్మల అనిరుధ్(11)మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలతో బయటపపడ్డారు. సెప్టెంబర్ 11న సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఆరో తరగతి విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. వెంటనే కరీంనగర్ దవాఖానకు తరలించి చికిత్స అందించడంతో కోలుకున్నాడు.