ధర్మపురి, సెప్టెంబర్ 16 : తమకు సరిగా చదువు చెప్పని సారు వద్దని ధర్మపురి మండలం మగ్గిడి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు మంగళవారం తరగతులను బహిష్కరించారు. కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు (పీజీటీ) టీ కరుణాకర్ ఈ విద్యాసంవత్సరమే వరంగల్ నుంచి పనిష్మెంట్ కింద బదిలీపై ఇక్కడకు వచ్చినట్లు తెలిసింది. ఆయన 9, 10వ తరగతులతోపాటు ఇంటర్ విద్యార్థులకు కెమిస్ట్రీ బోధిస్తున్నాడు.
అయితే కరుణాకర్ బోధించే విధానం అర్థం కావడం లేదని, డౌట్లు అడిగితే బూతులు తిడుతున్నాడని, పరీక్షల్లో ఏమి రాసేదని..? ఆరోపిస్తూ విద్యార్థులు పలుసార్లు ప్రిన్సిపాల్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ కూడా పట్టించుకోకపోవడంతో విసిగిపోయి 9వ తరగతి విద్యార్థులు మంగళవారం ఉదయం 10.30 గంటలకు తరగతి గది నుంచి బయటకు వచ్చారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు గంటన్నర పాటు ఆవరణలో ఎండలో కూర్చొని నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్ మహేశ్ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో సీతాలక్ష్మి మోడల్ స్కూల్‌కు చేరుకోగా, విద్యార్థులు తమ సమస్యను వివరించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ పద్మను వివరణ కోరగా, విద్యార్థుల ఫిర్యాదు మేరకు సమస్యను మోడల్ స్కూల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసాచారి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.