జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 16 : ఆటో కిరాయి రూ.300 విషయంలో ఓ ఆటో డ్రైవర్‌ను ఇద్దరు బిహార్ రాష్ర్టానికి చెందిన యువకులు దారుణంగా హత్య చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని గుల్లపేట గ్రామ శివారులో జరిగిన ఈ కేసుకు సంబంధించి నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మంగళవారం వివరాలు వెల్లడించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుతారిపేటకు చెందిన ఆటో డ్రైవర్ నయీమొద్దీన్(50) తన ఆటోలో ప్రయాణికులను ఆదివారం రాత్రి 12 గంటలకు ధర్మపురికి తీసుకెళ్తున్న సమయంలో బిహార్ రాష్ట్రం సంస్తిపూర్ జిల్లాకు చెందిన దర్శన్ సాహ్ని(31,) సునీల్ సాహ్ని(41) ఆటోలో ఎక్కారు. ఈ క్రమంలో గుల్లపేటలో దిగేందుకు రూ.300 కిరాయి మాట్లాడుకున్నారు. గుల్లపేటలో దిగిన తర్వాత కిరాయి చెల్లింపు విషయంలో ఇద్దరూ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో గొడవ చేసి నయీమొద్దీన్ మెడను గుడ్డతో నులిమి, బండరాయితో దాడి చేసి హత్య చేశారు. తర్వాత సెల్‌ఫోన్‌ను తీసుకొని పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాలను సేకరించి తక్షణమే నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి హత్య సమయంలో ఉన్న రక్తపు మరకల దుస్తులు, దొంగిలించిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును 24 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్ఐ సదాకర్, సిబ్బందిని ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రఘు చందర్ అభినందించారు.