వరికొయ్యలను కాల్చడం పెనుముప్పుగా మారుతున్నది. కాల్చకుండా కలియదున్నినా, పొలంలో అలాగే వదిలేసినా ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. అవగాహన లేక మెజార్టీ రైతులు తగులబెడ్తుండడం తీరని నష్టాన్ని మిగులుస్తున్నది. భూసారం దెబ్బతిని దిగుబడులు తగ్గడమే కాదు, పర్యావరణానికీ ప్రమాదం జరుగుతున్నది. ఈ క్రమంలో ఒక్కోసారి రైతుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతున్నది. తాజాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లపెల్లికి చెందిన ఓ రైతు పంట వ్యర్థాలు కాలుస్తూ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.
పంట వ్యర్థాలను విచ్చలవిడిగా కాల్చడం పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. భవిష్యత్ విపత్తును ముందుగానే గ్రహించి అడ్డుకట్ట వేసేందుకు తొమ్మిదేళ్ల క్రితమే బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ జీవో ఎంఎస్ నంబర్ 27ను తెచ్చింది. అయితే, అవగాహన లేక కొంత మంది రైతులు పంట వ్యర్థాలను కాలుస్తుంటే.. అన్నీ తెలిసీ కూడా మరి కొంతమంది వ్యర్థాలను సక్రమంగా వినియోగించుకోవడాన్ని ఓ పనిగా భావిస్తున్నారు. ప్రకృతికి చేటని తెలిసినా సులువుగా పంట వ్యర్థాలకు నిప్పంటించి చేతులు దులుపుకుంటున్నారు.
ఈ పరిణామంతో వాతావరణంలో మోతాదుకు మించి కార్బన్డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర వాయువులు విడుదలవుతూ పర్యావరణ సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వరికొయ్యలను పొలంలో వదిలేస్తే పంట అవశేషంగానే మిగిలిపోతుందని, కానీ, కొయ్యకాళ్లు, గడ్డిని కంపోస్టుగా మార్చుకోవడంపై రైతులకు అవగాహన లేక తగులబెట్టడం వల్ల ఎంతో నష్టం వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, భూసారం దెబ్బతింటుందని చెబుతున్నారు. అలాగే, మనిషి ఆరోగ్యం సైతం ప్రమాదంలో పడుతున్నదని, శ్వాస సంబంధిత రోగాలను కొని తెచ్చుకుంటున్నారని హెచ్చరిస్తున్నారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), కేంద్ర ప్రభుత్వ ఘన వ్యర్థాల నిర్వహణ, నియమావళి ఆదేశాల ప్రకారం.. వాయు కాలుష్యాన్ని అరికట్టడం, భూసారాన్ని రక్షించడం ఈ జీవో 27 ప్రధాన ఉద్దేశం. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, ప్లాస్టిక్, పంట వ్యర్థాలను తగలబెట్టడం పూర్తిగా నిషేధం. ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించాలని ఆదేశాలున్నాయి. రైతులు పంట వ్యర్థాలను, ప్రజలు, సంస్థలు బహిరంగంగా కాలిస్తే మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ, గ్రామ పంచాయతీలు జరిమానా విధిస్తాయి. ఒక వేళ స్థానిక సంస్థలే డంప్ యార్డుల్లో చెత్త కాలిస్తే, ఆయా సంస్థలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిహారం కింద భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. వరి, మక, పత్తి ఇతర పంట వ్యర్థాలను బహిరంగంగా కాలిస్తే రూ.5 వేలు, పెద్ద ఎత్తున పంట, పారిశ్రామిక వ్యర్థాలు, చెత్తాచెదారం ఒక చోట వేసి తగలబెడితే రూ.25 వేల జరిమానా విధిస్తారు. మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు నిర్వాహకులు తమ పరిధిలో చెత్త కాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ తగులబెడితే సదరు స్థానిక సంస్థలకు సైతం రూ.25 వేల జరిమానా విధిస్తారు. పంచాయతీలు, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలు రోజువారీగా వెలువడే చెత్త వ్యర్థాలను రీసైకిల్ చేయడంతోపాటు విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఇంధనంగా ఉపయోగించాల్సి ఉంటుంది.

కొయ్యకాలును కాలబెడితే నష్టాలే తప్ప ఎలాంటి ప్రయోజనాలూ ఉండవు. భూమి విపరీతమైన వేడితో సారం కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, పాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గి దిగుబడి తగ్గుతుంది. భూమికి పీచు పదార్థంగా ఉపయోపగడే అవశేషాలు కాలిపోతాయి. పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. నేలలోని పోషక గుణాలు నష్టపోవడమే కాకుండా మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోతాయి. పొలాల్లో తిరిగే పాములు, ముంగిసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రకృతి సమతౌల్యత దెబ్బతింటుంది. గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు అగ్నికి బుగ్గవుతుండడంతో పర్యావరణానికి తీరని హాని కలుగుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గరే ఉన్న ధాన్యం కాలిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
పంట వ్యర్థాలు కాల్చడం వల్ల భూమికి ఎంతో నష్టం జరుగుతుంది. అదే భూమిలో కలిసేలా చేస్తే భూమి ఎంతో బలం చేకూరుతుంది. భూమిలో ఉండే సూక్ష్మజీవులు విడుదల చేసే ఎంజైమ్లతో పంటల వ్యర్థం కర్బన సేంద్రియంగా మారుతుంది. వరికొయ్యలు, పత్తి కట్టె, మక, ఇతర పంట వ్యర్థాలను రోటవేటర్ లేదా ష్రెడర్ యంత్రం ద్వారా భూమిలో కలిసేలా చేస్తే కంపోస్టుగా మారి నేల గుల్లబారుతుంది. ఫలితంగా గాలి ప్రసరణ పెరిగి, మొకల ఎదుగుదల బాగుంటుంది. లేదంటే సింగిల్ సూపర్ ఫాస్పేట్, డీకంపోజర్ ద్రావణాన్ని తయారు చేసి, పొలంలోని నీటిలో కలపడం ద్వారా వరి గడ్డి, కొయ్యలు వేగంగా కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా మారుతుంది.