Collector Koya Sri Harsha | పెద్దపల్లి, అక్టోబర్ 30 : పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్ద అరుణ శ్రీ, డీసీపీ కరుణాకర్‌తో కలిసి కలెక్టర్ రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులతో గురువారం సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్, ఎన్టీపీసీ, గోదావరిఖని-1 టౌన్లో అధికంగా ప్రమాదాలు జరిగే 28 హాట్ స్పాట్లను గుర్తించి రూ.27 లక్షలతో ఎల్ఈడీ హైమాస్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని పట్టణంలో రూ.15 లక్షల ఖర్చుతో నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. రోడ్డుపై పశువులు విడిచిపెట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ రూ. 10 వేల జరిమానా విధించాలని, పశువులను గోశాలలకు తరలించాలని సూచించారు.
జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ..
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాల కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు, హెచ్‌కేఆర్ సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రించాలన్నారు. రామగుండంలో అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది జరిగిన ప్రమాదాలపై రిపోర్డు అందించాలన్నారు. పట్టణ ప్రాంతాలలో రోడ్డు స్ట్రిప్స్, రేడియం స్టిక్కరింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అధికంగా ట్రాఫిక్ ఉండే జంక్షన్ల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ బీ వనజ, ఆర్అండ్బీ ఈఈ బావ్ సింగ్, ఏసీపీలు కృష్ణ, రమేష్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు బండి ప్రకాష్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, సీఐలు, ఎస్సైలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.