Godavarikhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 5 : నాలుగు లేబర్ కోడ్ల రద్దు, కార్మిక చట్టాల పరిరక్షణకై సమ్మె ఒక్కటే కార్మికులకు ఆయుధమని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా వేల్పుల కుమారస్వామి పేర్కొన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ఫైవింక్లయిన్, తిలక్ నగర్, రమేష్ నగర్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులతో గురువారం సమావేశమయ్యారు. 12న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ ను విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిందనీ, దీన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్ధించడం సరికాదన్నారు. కార్మిక హక్కులు హరించి పెట్టుబడి దారి వ్యవస్థకు ఉపయోగపడే ఈ విధానంను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.25వేలు అమలు చేయాలనీ, పెండింగ్లో ఉన్న అన్ని సమస్యల పరిష్కారంకు సమ్మె పోరాటమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.
12న జరిగే సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పర్శ రాములు, బోయిని రవీందర్, రామలక్ష్మీ, సంతోష్, బండి లక్ష్మీ, నూనె లక్ష్మీ, దాసారపు సమ్మయ్య, తోటపల్లి శేఖర్, బెజ్జంకి సంతోష్, నర్సమ్మ , దేవమ్మ, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.