Koppula Eshwar | జగిత్యాల కలెక్టరేట్: గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన దండ్ల శ్రీనివాస్ పై దాడి చేసిన మంత్రి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్తో కలిసి ఆయన శుక్రవారం ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా అరాచక పాలన నడుస్తోందని, సంఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని, దాడి వెనుక ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులకు ఇదివరకే నేరచరిత్ర ఉందని, వీరిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపాడుతున్నారని, దాడికి యత్నించిన వారితో ప్రాణహాణి ఉందని ఎస్పీ తో బాధితుడి శ్రీనివాస్ భార్య వాపోయింది. నిందుతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టామని, నిందితులు పరారీలో ఉన్నారని, వారిని ట్రేస్ చేసి పెట్టుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
బాధితుడిని ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మాజీ జెడ్పీటీసీ, పార్టీ అధ్యక్షుడు గొస్కుల జలెంధర్, మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, పీఏసీఎస్ చైర్మన్ వెంకట మాధవ రావు, మాజీ సర్పంచ్ రవీందర్, మాజీ ఉప సర్పంచ్ మారం శేఖర్, అశోక్ రావు, మండల యూత్ అధ్యక్షుడు చెవుల రవీందర్, బాలబత్తుల కిషన్, బీఆర్ ఎస్వీ మండల అధ్యక్షుడు ఆవారి చందు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.