ముస్తాబాద్, మే 8: తెలంగాణ రాష్ట్రంలో సహకార సంఘాల సేవలు అద్భుతమని స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కొనియాడారు. ఉమ్మడి పాలనలో నిర్వీర్యమైన సొసైటీలను స్వరాష్ట్రంలో లాభాల బాట పట్టించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని కొనియాడారు. కేడీసీసీల పురోగతికి కొండూరి రవీందర్రావు విశేష కృషి చేశారని ప్రశంసించారు. సోమవారం ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో రూ. 50లక్షలతో నిర్మించిన సొసైటీ భవనాన్ని కొండూరి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు దాటిన ప్రస్తుత తరుణంలో దేశం ఎటుపోతుందో చర్చించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. గత పాలకులు అనుసరించిన అస్తవ్యస్త విధానలతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నదని మండిపడ్డారు. బడాబాబులకు రుణాలు మాఫీ చేసి సామాన్యులను ఇబ్బందిపెడుతున్నదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ జాతీయ బ్యాంకులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. స్విస్ బ్యాంకు నుంచి నల్ల ధనాన్ని తీసుకువచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తామని నమ్మించి జన్‌ధన్ ఖాతాలు తెరిపించి మోసం చేశారన్నారు. కానీ, నయాపైసా జమచేయకుండా నట్టేట ముంచిందని నిప్పులు చెరిగారు. కానీ ఇందుకు భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేస్తున్నదని చెప్పారు. సహకార సంఘాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించి రైతులకు మెరుగైన సేవలందిస్తున్నదని కొనియాడారు. విదేశాల్లో చదువుకోవాలనుకొనే గ్రామీణ నిరుపేద విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇస్తున్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 200 గురుకులాలు ఉండగా, నేడు వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు.
పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో రూ.100 కోట్లతో కొత్త డెయిరీని ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. గతంలో రూ.59 కోట్ల నష్టాల్లో ఉన్న కేడీసీసీని రూ. 91 కోట్ల లాభాల్లోకి తేవడం కొండూరి పనితనానికి నిదర్శమని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన బ్యాంకు ఆవరణలో మొక్కను నాటారు. అన్నదాతకు చేయూత.. వ్యాపారానికి ప్రోత్సాహం: కొండూరి రవీందర్రావు ఈ సమావేశంలో న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ సహకార బ్యాంకులు అన్నదాతకు చేయూతనందిస్తూ వ్యాపారులకు ప్రోత్సాహన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో 67 బ్యాంకు బ్రాంచ్‌లు ఉండగా, మరో ఐదు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 14 బ్యాంకు భవనాలు, నిర్మాణాలకు 9 స్థలాలు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. బ్యాంకుల ద్వారా గృహ, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రుణాలు ఇస్తున్నామని వెల్లడించారు. 900 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.
ప్రజలు సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే మరి కొంత మందికి సహకారం అందించిన వారవుతారని పేర్కొన్నారు. రూ. 40 కోట్ల టర్నోవర్‌తో నడుస్తున ఆవునూర్ బ్యాంకు అభివృద్ధికి దోహదం చేయాలని కోరారు. బ్యాంకు ద్వారా పలువురికి రూ. 1.62 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. పోతుగల్ సహకార సంఘం ద్వారా నలుగురికి రూ.15 లక్షల రుణాన్ని వినోద్‌కుమార్, రవీందర్రావు చేతుల వీదుగా ముస్తాబాద్ పీఏసీఎస్ చైర్మన్ బాపురావు అందించారు. ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, కల్వకుంట్ల గోపాల్‌రావు, సెస్ డైరెక్టర్ ఏనుగు రవీందర్‌రెడ్డి, సందుపట్ల అంజిరెడ్డి, సహకార సంఘాల అధ్యక్షులు తన్నీరు బాపురావు, రాజేందర్‌రెడ్డి, సర్పంచ్ బద్ది కల్యాణి, ఎంపీటీసీ లలిత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్‌రావు, ఉచ్చిడి మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, డీసీఓ బుద్ద నాయు డు, సీఈఓ సత్యనారాయణరావు, నాబార్డు డీడీఎం మనోహార్‌రెడ్డి,రిస్సోర్స్ పర్సన్ సత్యనారాయణ పాల్గొన్నారు.