Seasonal diseases | కార్పొరేషన్, జూన్ 16 : కరీంనగర్లో రానున్న వర్షకాలంలో ఎక్కడ కూడా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలని నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వ్యాపార సముదాయాలు, మద్యం దుకాణాల యజమానులు తమ సంస్థల నుంచి వెలువడే చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి నగరపాలక సంస్థ వాహానాలకు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమ నేపథ్యంలో నగరంలోని లక్ష్మినగర్, ఆదర్శనగర్, మంచిర్యాల్ రస్తా తదితర ప్రాంతాలను పారిశుద్ద్యం అధికారులతో కలిసి తనిఖీ చేసి పరిశీలించారు. ఆదర్శనగర్ వద్ద మద్యం దుకాణదారులు షాపు ఎదుట పరిసర ప్రాంతంతో పాటు డ్రైనేజీల్లో చెత్తను వేసినందుకు రెండు షాపులకు జరిమానా విధించాలని ఆదేశించారు.
ఆ మేరకు అధికారులు రెండు షాపులకు రూ.10 వేల చొప్పన జరిమాన విధించారు. లక్ష్మినగర్లోని ఖాళీ స్థలంలో నిలిచిన వర్షం నీటిని కచ్చా నాలా ద్వారా తొలగించి స్థల యజమానికి జరిమానా విధించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షకాలంలో నగర ప్రజలు విషజ్వరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొవడంతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రోడ్లు, పరిసర ప్రాంతాల్లో చెత్త వేయడం పూర్తిగా నిషేధించడం జరగిందన్నారు.
నిబంధనలు అతిక్రమించి చెత్తను పరిసరాలు, డ్రైనేజీల్లో వేస్తే జరిమానాలు విధిస్తామని తెలిపారు. నివాస గృహాల యజమానులు, వ్యాపార దుకాణదారులు ఉత్పత్తి అయ్యే చెత్తను తడి పొడిగా వేరు చేసి అందించాలన్నారు. వర్ష కాలంలో వచ్చే విషజ్వరాలు రాకుండ తగిన నివారణ, జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. నగర వ్యాప్తంగా డివిజన్ల వారిగా పారిశుద్యం అధికారులు సిబ్బంది చేసే పారిశుద్య పనుల్లో చాలా మార్పులు తేవాలని ఆదేశించారు. వర్ష కాలంను దృష్టిలో పెట్టుకొని డివిజన్ల వారిగా పని చేస్తున్న కార్మికులు, సిబ్బంది పారిశుద్య పనులను మెరుగ్గా చేయాలన్నారు. పరిసరాలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేయడంతో పాటు డ్రైనేజీలను కూడ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చెత్త కలెక్షన్ పాయిట్లు, డంపర్ బిన్ పాయింట్ల వద్ద పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు.
వర్షాలతో నగరంలో ఎక్కడైన నీరు నిలిచి వుంటే వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. నీరు నిలిచిన చోట దోమల నివారణ చర్యలో భాగంగా స్ప్రే, ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. వంద రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలను డివిజన్ల వారిగా చేపట్టి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామి, సానిటేషన్ ఇన్ స్పెక్టర్లు నర్వోత్తమ్రెడ్డి, శ్రీధర్, డీఆర్ఎఫ్ సిబ్బంది, జవానులు పాల్గొన్నారు.