నిత్యం వేలాది మంది వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్తుంటారు. ప్రధానంగా ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు పోటీ పరీక్షలకు దరఖాస్తు సమర్పిస్తుంటారు. మూడు రోజుల నుంచి సర్వర్డౌన్ కావడంతో మీ సేవ కేంద్రాలు నిలిచిపోగా, డాక్యుమెంట్ల కోసం వేలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 13: ప్రజల సౌలభ్యమే లక్ష్యంగా వేగంగా… సులువుగా సేవలందించేందుకు గానూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 550వరకు మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో రోజుకు దాదాపు 1,200 నుంచి 1,500దాకా వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు వస్తుంటాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖ ద్వారా అందించే ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలే కీలకమైనవి. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు పలు విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఇతర ప్రవేశాల కోసం ప్రాథమికంగా మీ సేవ కేంద్రాల్లోనే సమర్పించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో మీ సేవ కేంద్రాల్లో తరచుగా సర్వర్లు పని చేయకపోవడంతో గంటల వ్యవధిలోనే పరిష్కారం చూపేవారు. అయితే మూడు రోజుల నుంచి కేంద్రాలు మొత్తమే పని చేయకపోవడంతో పోటీ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షలకు దరఖాస్తు చేసుకునే వేలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి లక్షల్లో నష్టం వస్తున్నా పట్టించుకోకపోవడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. డీఎస్సీ దరఖాస్తుల గడువు కూడా నేటితో ముగియనున్నది. సర్వర్ సమస్యతో ఇప్పటివరకు కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభించకపోవడంతో విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ సమస్య పరిష్కారం కాకుంటే ప్రత్యామ్నాయంగా ధ్రువీకరణ పత్రాలు అందించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాల్లో మూడు రోజుల నుంచి సర్వర్ డౌన్ సమస్య ఉన్నది. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అప్పుడు గంటల వ్యవధిలోనే పరిష్కారం లభించేది. ఎన్నడూ ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొలేదు. సర్వర్డౌన్ సమస్య పరిష్కారం మా చేతుల్లో లేదు. ప్రత్యామ్నాయ మార్గంపై ఉన్నతాధికారులు అన్వేషిస్తున్నారు.