చొప్పదండి, అక్టోబర్ 22 : చొప్పదండి అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవి శంకర్‌కు ట్రస్మా సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం చొప్పదండి పట్టణంలో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రవిశంకర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
గతంలో ఆయన పాఠశాల కరస్పాండెంట్‌గా సేవలను అందించారని, అదే స్ఫూర్తితో గత ఎన్నికల్లో గెలిపించుకున్నామని గుర్తు చేశారు. ఈసారి మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన నైతిక బాధ్యత ట్రస్మా సభ్యులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పుల్యాల లక్ష్మిరెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు గుర్రం ఆనంద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి శ్రీనివాస్, కోశాధికారి కొనమల్ల దేవానంద్, ఉపాధ్యక్షుడు తమ్ముడి కనకరాజు, కరస్పాండెంట్లు నాగరాజు, కురుమచలం రత్నాకర్, ఎస్వీజేసీ కళాశాల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ, నవీన్, కుమార సురేందర్, సిరిపురం శ్రీనివాస్ పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 22: విజయ దశమి హిందువులకు విశిష్టమై రోజు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా నిర్వహించుకునే పండుగ. చిన్నాపెద్దా అందరూ ఒక్కచోట చేసుకొనే వేడుక. ఈ రోజు చేపట్టే ప్రతీ పనిలో విజయం లభిస్తుందని నమ్మకం. అందుకే శక్తి స్వరూపిణీ ఆశీస్సులతో ప్రారంభిస్తారు. దసరా అంటే పది దుర్గుణాలపై గెలిచే సాధించే శక్తినిచ్చేది. దశహర అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలో పది అవగుణాలైన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య, స్వార్థ, అన్యాయ, అమానవత్వ, అహంకారంపై జయించే శక్తినిచ్చేది కనుకనే దీనిని విజయదశమి అని కూడా అంటారు.

మహిషాసురుడు బ్రహ్మవరం వల్ల గర్వితుడై ముల్లోకాలను బాధ పెడుతుంటే ఆ బాధలు భరించలేక దేవతలు త్రిమూర్తులను వేడుకున్నారు. త్రిమూర్తులు సకల లోక పావనీ దుర్గామాతను స్తుతించారు. దుర్గామాత తొమ్మిది రోజుల పాటు భీకర పోరాటం సాగించి తొమ్మిదో రోజు మహిషాసురున్ని సంహరిస్తుంది. ఆ రోజు ఆశ్వయుజ మాసం శుధ్ధ నవమి. దుర్గామాత దుష్ట శిక్షణ గావించిన మరునాడు జరుపుకున్న విజయోత్సవమే విజయ దశమి.
విజయదశమి రోజు శమీ ‘జమ్మి చెట్టు)దర్శనం, శమీ పూజ చేయాలని శాస్త్ర వచనం.. పూర్వం ప్రజాపతి పంచ భూతాల్లో భాగంగా అగ్నిని సృష్టించాడు. అయితే అగ్ని తననే దహించివేయ సాగింది. దీంతో ఆందోళన చెందిన ప్రజాప్రతి అగ్నిని శమింపజేసేందుకు ఓ వృక్షాన్ని సృష్టించాడు. అదే జమ్మిచెట్టు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ వృక్షం వద్దకు విజయదశమి నాడు చేరుకొని ప్రదక్షిణలు చేయడం ఆచారం. ఇలా చేయడం ద్వారా చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తున్నది నమ్మకం.
మహిషాసురుడిని వధించడానికి దుర్గాదేవి అష్టభుజాలతో అవతరించింది. హిమవంతుడు ఇచ్చిన సింహాన్ని అధిరోహించి మహిషాసుర మర్ధన చేసింది. అందువల్లే ఆయుధాల్ని పూర్వం రాజులు అలంకరించి పూజించేవారు. ఆ ఆచారంతోనే దసరా రోజు యంత్రాం, వాహన, పనిముట్లకు పూజలు చేయడం, వాహనాలను, యంత్రాలను పూలతో అలంకరించడం, ఫ్యాక్టరీలలో, భారీ వాహనాల ముందు జంతు బలి ఇవ్వడం ఆనవాయితీ.
దసరా రోజు పాల పిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకం ఉంది. ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ. పాల పిట్టను చూస్తే పాపాలు, కర్రెపిట్టను చూసే కష్టాలు, గరత్మంతుడిని చూస్తే గండాలు తొలుగుతాయని విశ్వాసం.
విజయదశమి సంబురాలను సోమవారం జిల్లా వ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ మేరకు ఆయా కాలనీలు, దుర్గామాత మండపాల వద్ద శమిపూజలు, వాహన పూజలు నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. గిద్దెపెరుమాళ్ల ఆలయం లో ఎండోమెంట్ అధికారులు, మార్క్‌ఫెడ్ మైదా నం రావణ దహనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.