విద్యానగర్/కొత్తపల్లి, నవంబర్ 22 : జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో కరీంనగర్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్ చాట్ల, నీలం లక్ష్మణ్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, శారీరక వ్యాయామం లేకపోవడంతో చిన్న వయసులోనే రక్తపోటు, మధుమేహం, గుండెపోటు తదితర రోగాలు వస్తున్నాయన్నారు. ఈ క్రమంలో అథ్లెటిక్స్‌లో భాగమైన నడక, పరుగుపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటి ప్రాముఖ్యతను తెలియజేసేందుకు నగరంలో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 1500 మాస్టర్ అథ్లెట్స్‌లో పాల్గొంటున్నారని, పురుషులు, మహిళలకు వేర్వేరుగా 14 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. అందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. పోటీల్లో ప్రతిభ చాటిన వారు రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీరాలో ఫిబ్రవరి వారంలో జరిగే జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి కుడాల శిరీష్‌కుమార్, ఉపాధ్యక్షుడు మహేందర్, మన్సూర్, ప్రభాకర్, పద్మ, రాధ, అమర్ పాల్గొన్నారు.