ఆధునిక హంగులు, సకల సౌకర్యాలు, బ్రాంచ్‌ల వారీగా ప్రత్యేక గదులు, నేర విచారణకు కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సీడీఆర్(కాల్ డిటెల్ రికార్డు) సెంటర్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం విభాగాలు.. ఇలా అత్యున్నత ప్రమాణాలతో రామగుండం పోలీసు కమిషనరేట్ రెడీ అయింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దేశంలో మరెక్కడా లేని విధంగా నిర్మించిన పాలనా భవనం ప్రగతికి చిహ్నంగా.. రాష్ర్టానికే మణిహారంగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సహకారంతో గోదావరిఖని-రామగుండం మధ్య పోలీసు హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో 29ఎకరాల స్థలంలో 38.50కోట్లతో జీప్లస్-2 పద్ధతిలో ఆవిష్కృతమై, ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సోమవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఆరంభం కాబోతుండడం, అన్ని కార్యాలయాలు ఒకే చోట కొలువుదీరుతుండడంతో నేరపరిశోధన, విచారణ, రికార్డుల పరిశీలన ఎంతో సులువుకానున్నది.
– పెద్దపల్లి, మే 7 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, మే 7 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని : మొదట మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించనున్న మంత్రి, మధ్యాహ్నం 2.45గంటలకు హెలిక్యాప్టర్‌లో గోదావరిఖనికి చేరుకుంటారు. 3గంటలకు రామగుండం కమిషనరేట్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం 4గంటలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేలా నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ‘రామగుండం నవనిర్మాణ సభ’ పేరిట తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
అభివృద్ధి చిహ్నం పైలాన్
బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామగుండం నియోజకవర్గం, నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో భారీ పైలాన్‌ను ఏర్పాటు చేశారు. ఈ పైలాన్‌పై రామగుండం అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రభుత్వం కేటాయించిన నిధులు, రామగుండం మెడికల్ కాలేజీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వివరాలను ప్రధానంగా పొందుపరిచారు.
పాల్గొననున్న మంత్రులు, విప్‌లు
రామగుండం పర్యటనలో మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మరో మంత్రి కొప్పుల ఈశ్వర్, మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, విప్ బాల్క సుమన్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొనున్నారు.
రామగుండం గులాబీమయం
మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రామగుండం నగరాన్ని గులాబీ ఫ్లెక్సీలతో నింపేశారు. గోదావరిఖనిలోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద సీఎం కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు ఏర్పాటు చేశారు.
50వేల మందితో సభ
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో ఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ‘రామగుండం నవ నిర్మాణ సభ’ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 50వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అమాత్యుడు రామన్న హాజరై, అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
సభా ఏర్పాట్ల పరిశీలన
జవహర్లాల్ స్టేడియంలో ఏర్పాటు చేసి సభా ఏర్పాట్లను ఎంపీ వెంకటేశ్‌నేతకాని, మండలి చీఫ్ విప్ భాను ప్రసాద్‌రావు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదివారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. మంత్రి కేటీఆర్ యువతరానికి స్పూర్తి ప్రధాతగా నిలుస్తున్నారని చెప్పారు. మంత్రి పర్యటనతో చేపడుతున్న సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక్కడ మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు ఉన్నారు.
బొట్టు పెట్టి సభకు ఆహ్వానం
కోల్‌సిటీ, మే 7 : మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు ప్రతి ఇంటి నుంచి మహిళలు రావాలని పవర్‌హౌస్ కాలనీ పవ ర్ ఉమెన్ కమిటీ అధ్యక్షురాలు మూల విజయారెడ్డి కోరా రు. ఆదివారం సాయంత్రం 7వ డివిజన్ పరిధి పవర్‌హౌస్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి మహిళలకు నుదుట బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. ఆమె వెంట కమిటీ సభ్యులు స్వరూప, లక్ష్మీ, దేవేంద్ర, సుగుణ, సరిత, జ్యోతి ఉన్నారు.
నవతరానికి నడకలు నేర్పిన నేత కేటీఆర్
రాష్ట్రంలో నవతరానికి నడకలు నేర్పిన గొప్ప నేత రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. రామగుండంలో పోలీసు కమిషనరేట్ ప్రారంభం, పైలాన్ ఆవిష్కరణ, రామగుండం నవ నిర్మాణ సభలో పాల్గొనేం దుకు వస్తున్న ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతాం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ప్రజలకు పాలన చేరువైంది. రామగుండంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నిర్మించిన పోలీసు కమిషనరేట్ భవనంతో సేవలు మరింత చేరువవుతాయి. ఒకప్పటి జనగామ కాలక్రమంలో నోటిఫైడ్ ఏరియాగా, మున్సిపాలిటీగా, కార్పొరేషన్‌గా మారిపోయింది. జిల్లా కేంద్రాన్ని తలపించేలా ఈ ప్రాంతంలో ఈ రోజు మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు వచ్చాయి. రామగుండం నవనిర్మాణం జరిగింది బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే. ఈ క్రమంలోనే నవ నిర్మాణ సభను నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేసి, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపనున్నారు. సభకు అన్ని ఏర్పాట్లు చేశాం.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే