రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజా పాలన పేరిట గ్రామ సభలు నిర్వహిస్తున్నది. ఆరు గ్యారెంటీలను అమలు కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. ఒక్కో మండలానికి తహసీల్దార్, ఎంపీడీవోతో రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి సభలో ఐదు పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నది. గ్రామ సభల పర్యవేక్షణకు నియోజకవర్గం, మండల, మున్సిపాలిటీలకు ఇన్చార్జి అధికారులను నియమించడంతోపాటు గ్రామ, వార్డు, డివిజన్ సభల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
కరీంనగర్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీల అమలు కోసం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలానికి తహసీల్దార్, ఎంపీడీవోల నేతృత్వంలో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల అధికారులు ప్రతి రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక గ్రామ సభలో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో గ్రామ సభకు వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఐదు పథకాలకు దరఖాస్తులు
ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది వరకే కల్పించింది. ఇప్పుడు ప్రతి నెలా 2500 ఆర్థిక సహాయం, 500కే వంట గ్యాస్ సదుపాయం, రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా 15 వేల పెట్టుబడి, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల సహాయం, గృహజ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక చేయూత పథకం కింద నెలకు 4 వేల పింఛన్ కోసం కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు.
గ్రామ సభలకు ఏర్పాట్లు
గ్రామ సభల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ప్రతి గ్రామ, డివిజన్, వార్డు సభలకు 10 వేల చొప్పున కేటాయించింది. ఈ నిధులతో దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రతి గ్రామ, వార్డు సభల్లో వంద నివాస గృహాలకు ఒకటి చొప్పున దరఖాస్తులు స్వీకరించే కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దరఖాస్తుదారులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి దరఖాస్తు ఫారం రూపొందించిన ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు పంపించింది. వీటిని ఈ నెల 27 వరకు ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల వార్డులకు చేరేలా చూడాలని, ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు ముందుగా పూరించుకుని గ్రామ సభకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గ్రామ, వార్డు స్థాయిలో జరిగే సభలకు ఒక రోజు ముందు దండోరా వేయించాలని ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, భారీ సంఖ్యలో దరఖాస్తులు ఉన్నట్లయితే టోకెన్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
గ్రామ సభలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తాగు నీరు, నీడ కోసం టెంట్లు, క్యూ లైన్ల కోసం బారికేడ్లు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలకు గ్యారెంటీ అమలుతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు కూడా హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే, తమ దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను తప్పని సరిగా జత చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నది. కాగా, స్వీకరించిన దరఖాస్తులను ఏ రోజుకారోజు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో అధికారులు నమోదు చేయనున్నారు.
ఎక్కడ ఎన్ని కౌంటర్లు
గ్రామాలు, పట్టణాల్లో నివాస గృహాలకు అనుగుణంగా దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో 2 నుంచి 7 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
నేడు మంత్రుల సమీక్ష
ప్రజా పాలన గ్రామ సభల ఏర్పాట్లు, నిర్వహణపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొదటిసారిగా జిల్లాకు విచ్చేస్తున్నారు. అలాగే, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మొదటి సారిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.