‘పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో, మనం పోరాడి తెచ్చుకొన్న తెలంగాణకు సీఎంగా కేసీఆరే ఉండాలి. ఆయనే మనకు శ్రీరామరక్ష. ఇంతగా అభివృద్ధి చేసుకుంటున్న తెలంగాణను పోయి పోయి మళ్లీ ఇంకొకరి చేతుల్లో ఎలా పెడుదాం.. మీరే ఆలోచన చేయాలి” అని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ మన రాష్ర్టానికి చాలా ప్రమాదమని, అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని, అలాంటి వారికి తెలంగాణను అప్పగించి మళ్లీ 60 ఏళ్లు వెనక్కి పోదామా..?’ అని ప్రశ్నించారు. గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో ఆదివారం సాయంత్రం జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు.
– గోదావరిఖని, ఆగస్టు 27
గోదావరిఖని, ఆగస్టు 27: రాష్ర్టానికి సీఎం కేసీఆరే రక్ష అని, ఆయనే మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రమాదమని సూచించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం గోదావరిఖని మార్కండేయకాలనీలో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిందే తెలంగాణ అనీ, తెలంగాణ కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలు ప్రజలు వినరన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణ కోసం ఏనాడైనా వారు ఆలోచన చేశారో ఒక్కసారి ప్రశ్నించాలన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసుకోకుండా అడ్డుకున్న వారికి ఇప్పుడు తెలంగాణను అప్పగించి మళ్లీ 60 ఏళ్లు వెనక్కి పోదామా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకవెళ్లి ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనే ఉందన్నారు. పగటి వేషగాళ్ల మోసపూరిత ప్రచారాలకు ప్రభావితం గాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికులను రాచి రంపాన పెట్టి వారసత్వ ఉద్యోగాలను తాకట్టు పెట్టాయనీ, తెలంగాణ వచ్చాక వారసత్వ ఉద్యోగాలను సాధించుకునే ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం కూడా చేశాయని గుర్తు చేశారు. ఇవాళ సింగరేణిలో తండ్రులు దిగిపోయాక వారి వారసులు డ్యూటీలకు ఎక్కుతున్నారంటే సీఎం కేసీఆర్ చలువేనన్నారు. ఏనాడైనా కార్మికులకు లాభాల వాటా ఇచ్చారా..? కార్మికుల పిల్లల చదువుల కోసం ప్రయత్నం చేశారా..? అని జాతీయ సంఘాలను, పార్టీలను నిలదీయాలన్నారు. సీఎం కేసీఆర్ అయిన తర్వాత అత్యంత లాభాల వాటా ఇచ్చారనీ, కార్మికులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారనీ, సింగరేణికి దిశా నిర్దేశం చేసి లాభాల బాటలో నడిపిస్తున్నారన్నారు. ఇలాంటి సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందనీ, గుజరాత్‌కు ఇచ్చిన విధంగా సింగరేణికి గనులు కేటాయించాలని కోరితే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇదే గడ్డ మీద మాట ఇచ్చి వెళ్లిన 15 రోజులకే ప్రధాని మోడీ మాట తప్పి గనుల వేలం పెట్టాడనీ అలాంటి మోసగాడిని నమ్మితే ఆగం చేస్తాడన్నారు. సింగరేణి గురించి కాంగ్రెస్ కూడా మాట్లాడలేని అచేతన స్థితికి చేరిపోయిందన్నారు.
సింగరేణి సంస్థను కడుపులో పెట్టి కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్‌ను మనం ఆదరించాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టుకపోయిన వాడు రేవంత్ రెడ్డి అని, ఓటు వేసే ముందు కాంగ్రెస్, బీజేపీల దగాను ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఆ రెండు పార్టీల నాయకులతో అప్రమత్తంగా ఉండాలని, నమ్మితే ముంచుతరని విమర్శించారు. కాగా, రామగుండం 25వ డివిజన్‌కు చెందిన ఆటో వెంకటేష్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పులెందర్ సమక్షంలో నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరగా, ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ కండువాలు కప్పి ఆహ్వానించారు. సమావేశంలో మేయర్ అనిల్‌కుమార్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్, ధాతు శ్రీనివాస్, జనగామ కవిత, శంకర్ నాయక్, కుమ్మరి శ్రీనివాస్, సరోజన, కో-ఆప్షన్ తస్నీం భాను, బుచ్చిరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు శ్రీనివాస్, స్వామి, కోల లత, తుంగపిండి సతీశ్, ధర్మాజీ కృష్ణ, పీర్ల లక్ష్మీపతి, రవీందర్, దుర్గం కుమార్, జగన్, మస్కం శ్రీనివాస్, మండ రమేశ్, నీల గణేశ్,రాకం వేణు, అమరేందర్, శ్రీనివాస్, పిల్లి రమేశ్, శాంత లక్ష్మీ, బెందె నాగభూషణం, ప్రశాంత్,ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఉన్నారు.
బీఆర్ఎస్కు ఎదురుగా పోటీ చేసే దమ్ము ఉందా..?
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎదురుగా పోటీ చేసే దమ్ము ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్, బీజేపీ కేవలం తమ ఉనికి కాపాడుకోవడం కోసమే పోటీకి వస్తున్నాయే తప్ప ఓ ఎజెండా కూడా లేని ఆ పార్టీలు తెలంగాణలో గెలుస్తాయన్న నమ్మకం వారికి లేదు. నాకు టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండడమే గాకుండా రామగుండంలో గెలిచి మళ్లీ కేసీఆర్‌కు కానుకగా ఇస్తా. ఓటు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. రామగుండానికి మెడికల్ కాలేజీ ఎలా వస్తుందని మొదట కాంగ్రెస్, బీజేపీ నాయకులు హేళనగా మాట్లాడారు. అభివృద్ధి కోరుకునే అలా ఎందుకు ఎగతాళి చేశారో ఆలోచన చేయాలి. కానీ, అవేమీ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్‌ను కలిసి మెడికల్ కాలేజీ మంజూరు చేయించా.
సింగరేణి కార్మికులకు మెరుగైన లాభాల వాటా, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇలా ఎన్నో హక్కులు సాధించి పెట్టిన ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడడం ఖాయం. నా బలం.. నా బలగం.. గులాబీ సైనికులే. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుండటంతో ప్రతి ఇంటిలో ఆనందం వెల్లి విరుస్తున్నది. వారసత్వ ఉద్యోగాల అమలుతో సింగరేణి కార్మిక కుటుంబాల్లో సంతోషం తాండవిస్తున్నది. రామగుండం నియోజకవర్గాన్ని 12 క్లస్టర్లుగా ఏర్పాటు చేశాం. 78 మంది ఇన్చార్జిలు, 2,060 మంది బూత్ కమిటీ సభ్యులు, ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి కమిటీని వేశాం. 25 మంది సర్పంచ్‌లు, 36 మంది కార్పొరేటర్లు యుద్ధ ప్రతిపాదికన 5 రోజుల పాటు ఇల్లిల్లూ తిరిగి ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కు ఓటు వేసేలా అవగాహన కల్పించాలి.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే
కాంగ్రెస్ జూటా మాటలు నమ్మకండి
తెలంగాణలో దళితులకు ఇస్తున్న రూ.10లక్షల నగదు బదిలీ పథకం దేశంలో మరెక్కడైనా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులకు రూ.12లక్షలు దళిత బంధు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. 60 ఏళ్లుగా గుర్తుకు రానిది ఇప్పుడు దళితులు గుర్తుకొచ్చారా..?. కాంగెస్ జూటా మాటలు నమ్మితే ఆగమైపోవడం ఖాయం. వాళ్లు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రూ.12 లక్షలు ఇచ్చారా..? ఒక్కసారి ప్రశ్నించాలి. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మళ్లీ వారి చేతికి అప్పగించి మోసపోవద్దు. ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఒక్క ఓటు వేసినా మోసపోయినట్టే. స్కాములు తప్ప సంక్షేమం అంటే ఎరుగని కాంగ్రెసోళ్లు కూడా ఇవాళ సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తెలంగాణ అంటే మొదటి నుంచి వివక్షే. రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యవంతం చేయాలి.
– బోర్లకుంట వెంకటేశ్, పెద్దపల్లి ఎంపీ