కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. ఆధిపత్య పోరు ఇందిరమ్మ ఇండ్లకు అడ్డంకిగా మారుతున్నాయి. దీనికి నిదర్శనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలే! నిబంధనల ప్రకారం ఇందిరమ్మ కమిటీలు వేయాల్సిన గడువు దాటి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఈ రెండు సెగ్మెంట్లలో నేటికీ అతీగతీ లేదు. కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో వార్డులు, పంచాయతీల వారీగా అర్హుల జాబితాకు ఆమోద ముద్రపడ లేదు.
ఈ విషయంలో జోక్యం చేసుకొని పేదలకు న్యాయం చేయాల్సిన ఇన్చార్జి మంత్రి, ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఆధిపత్య పోరులో వేలు పెట్టేందుకు జంకుతున్నట్టు తెలుస్తున్నది. అందుకే కమిటీల జాబితా ఏర్పాటు పెండింగ్‌లో పెడుతున్నట్టు తెలుస్తుండగా, ఈ కారణం వేలాది మంది అర్హులకు శాపంలా మారింది. పేదల సొంతింటి కలకు బ్రేక్ పడుతుండగా, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు నిరాశే మిగులుతున్నది.
కరీంనగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు 2024 అక్టోబర్ 11న జీవో ఎంఎస్ 33ను జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయని స్పష్టం చేసింది. గ్రామ స్థాయిలో సర్పంచ్/ స్పెషల్ ఆఫీసర్ ఇందిరమ్మ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఉంటారని, గ్రామ కార్యదర్శి కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. మున్సిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్లు/ వార్డు అధికారులు ఉంటారని పేర్కొన్నది.
ఇక గ్రామం నుంచి ముగ్గురు సభ్యులను ఎంపిక చేయాలని, అందులో జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కమిటీలో కచ్చితంగా 50 శాతం మహిళలు ఉండాలని సర్కారు నిబంధన పెట్టింది. జనవరి 21 నుంచి 24 తేదీల మధ్య గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ కమిటీలు సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గంలో 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పింది. నిబంధనల ప్రకారం ఇందిరమ్మ కమిటీలు జనవరిలోనే ఏర్పాటు కావాలి. కానీ, గడువు దాటి నాలుగు నెలలవుతున్నా నేటికీ కరీంనగర్, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ నియోజవర్గాల్లో మాత్రం అర్హులకు ఆ యోగం పట్టడం లేదు. గ్రామ, జిల్లా స్థాయిల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల పర్యవేక్షణలో లబ్ధిదారులను గ్రామ సభల్లో గుర్తించి.. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే.. వాటికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. అప్పుడే అర్హుల తుది జాబితా ఖరారు అయినట్టు పరిగణించి, సదరు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారు. కానీ, ఈ రెండు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ వర్గీయుల్లో నెలకొన్న ఆధిపత్య, వర్గపోరు, వారివారి స్వప్రయోజనాల వల్ల ఇంకా ఇందిరమ్మ కమిటీలకే ఆమోద ముద్ర పడలేదు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాకేంద్రం కావడంతో.. ఇక్కడ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తమ ఆధిపత్యం చాటుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారే చాప కింద నీరులా.. తమ వర్గాలను విస్తరిస్తున్నారు. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయాయి. అందులో భాగంగానే ఇందిరమ్మ కమిటీల్లో ఎవరికి వారే తమ వారికి చోటు కల్పించేందుకు వేరువేరు జాబితాలు తయారు చేసి.. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ప్రతిపాదనలు పంపడంతో ఆయన వాటికి ఆమోద ముద్రవేయకుండా పెడింగ్‌లో పెట్టారని తెలుస్తున్నది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు పేర్ల జాబితా తయారు చేసి ప్రతిపాదనలు పంపి వాటికే ఆమోద ముద్రవేయాలని పట్టుపడుతున్నారు. ఇదే సమయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి.. మరో జాబితా రూపొందించి పంపారు.
వీరితో అంతగా సఖ్యత లేని మంత్రి పొన్నం వర్గీయులు.. వారు కూడా మరో జాబితా తయారుచేసి ఇన్చార్జి మంత్రికి పంపినట్టు తెలుస్తున్నది. ఇక్కడితో ఆగకుండా ఎవరికి వారే.. తమ జాబితాకు ఆమోద ముద్ర వేయాలంటూ.. ఇన్చార్జి మంత్రిపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తున్నది. దీంతో ఇందిరమ్మ కమిటీ ప్రతిపాదలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెడింగ్‌లో పెట్టారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి కరీంనగర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పిన పేర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
జగిత్యాల నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ అంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌కు ఆ పార్టీలో సీనియర్ నాయకుడు, జగిత్యాల కాంగ్రెస్ ఇన్చార్జి జీవన్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. వీరిద్దరి మధ్య పరస్పర విమర్శలు బాహాటంగానే సాగుతున్నాయి. ఒక వర్గం.. మరో వర్గాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నది. రెండు వర్గాల మధ్య ఇందిరమ్మ కమిటీ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి.
దీంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లోనూ రెండేసి జాబితాలు తయారై ఇన్చార్జి మంత్రికి అందినట్లుగా తెలుస్తున్నది. ఇరువురు పట్టువిడుపులు లేకుండా.. వారి వారి ప్రతిపాదనలను ఆమోదించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇందిరమ్మ కమిటీలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో అర్హులకు అన్యాయమే జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
నిజానికి ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యను ఇన్చార్జి మంత్రి గుర్తించి తక్షణం ఏదో ఒక నిర్ణయం తీసుకొని, అన్ని నియోజకవర్గాల మాదిరిగానే ఇక్కడ కూడా ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇన్చార్జి మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా, పార్టీ నాయకుల మధ్య వివాదం ప్రభావం.. ఇందిరమ్మ ఇండ్లపై పడుతుడడం కాంగ్రెస్‌లోని చాలా మంది నేతలకు సంకటంగా మారుతున్నది. ఈ రెండు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఏర్పడిన పోరు వల్ల దాదాపు ఏడు వేల పైచిలుకు ఇండ్లు మంజూరుకు నోచుకోకుండా పోతున్నాయన్న ఆవేదన సదరు నాయకుల్లో వ్యక్తమవుతున్నది. ఈ విషయాన్ని ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది.